
ఒక మంచి సినిమా వస్తే దాని గురించి పాజిటివ్‌గా మాట్లాడే దర్శకులు చాలా కొద్ది మందే ఉంటారు. అందులోనూ స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నవాళ్లు వేరే సినిమాల గురించి స్పందించడం తక్కువ. ఐతే రాజమౌళి మాత్రం అలాంటి భేషజాలకు పోడు. చిన్నదైనా.. పెద్దదైనా తనకు నచ్చిన సినిమా గురించి ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటాడు జక్కన్న. అలాగని బాలేని సినిమాల గురించి కూడా డబ్బా కొట్టే రకం కాదాయన. ఐతే కొన్ని సినిమాలు తనకు నచ్చినా సరే.. రాజమౌళి స్పందించలేని పరిస్థితి కూడా ఎదురవుతుంటుంది.
గత ఏడాది సంక్రాంతికి అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయనకు ‘నాన్నకు ప్రేమతో’ సినిమా నచ్చింది. కానీ ఆ సినిమా గురించి మాట్లాడలేని పరిస్థితి ఎదుర్కొన్నాడు. అందుక్కారణం.. దానికి పోటీగా ‘డిక్టేటర్’ రిలీజవ్వడమే. ‘డిక్టేటర్’ రిజల్ట్ ఏంటన్నది తెలిసిందే. అయితే ‘నాన్నకు ప్రేమతో’ గురించి స్పందించి.. ‘డిక్టేటర్’ గురించి మాట్లాడకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి సైలెంటుగా ఉండిపోయాడు జక్కన్న.
ఇక ఈ సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే ఆయన మనసు గెలిచింది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’నే అన్నది స్పష్టమైపోయింది. అలాగని చిరు సినిమాను తక్కువ చేయలేడు కదా. అలాగని గత ఏడాది లాగా సైలెంటుగా ఉండిపోలేదు జక్కన్న. ముందు చిరు సినిమా చూసి ఆయన పునరాగమనం గురించి మాత్రమే స్పందించాడు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. అంతే తప్ప సినిమా గురించి విశ్లేషణల్లోకి వెళ్లలేదు. కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో భిన్నంగా స్పందించాడు.
తాను ఎప్పుడూ విశ్లేషించే తరహాలోనే అన్ని విభాగాలు.. అందరి గురించి మాట్లాడాడు. తర్వాత క్రిష్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అతడిని ఉద్దేశించి ఓ లేఖ కూడా రాసి.. ఈ సినిమా తనకు ఎంతగా నచ్చేసిందో చెప్పకనే చెప్పాడు. మొత్తానికి నొప్పించక తానొవ్వక అన్నట్లుగా చాలా జాగ్రత్తగా తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు జక్కన్న.
Recent Random Post: