ఫిలిం సెలబ్రెటీలకు ఏం తక్కువ.. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, సకల సౌకర్యాలు.. ఇలా అన్నీ ఉంటాయి. వాళ్లకు ఏ సమస్యా ఉండదు అనుకుంటాం. కానీ ఈ రంగుల లోకంలో పడి కొట్టుకుపోతూ.. ఆత్మ కోల్పోయి.. ఆప్యాయతానురాగాలకు దూరమై సతమతం అయ్యేవాళ్లూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఏదో మిస్సవుతున్న భావనతో కుంగిపోయేవాళ్లు ఈ రంగంలో తక్కువేమీ కాదు. దీపికా పదుకొనే లాంటి పెద్ద స్టార్ హీరోయిన్.. ఒక దశలో డిప్రెషన్‌తో తీవ్రంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆమెకు ఏమీ లోటు లేదనే అనుకుంటాం. కానీ తనకలాంటి పరిస్థితి ఎదురుకావడం ఊహించలేనిది. ఇక ఒకప్పుడు వైభవం అనుభవించి.. ఆ తర్వాత ఫేడవుట్ అయిపోయిన ఉదయ్ కిరణ్ ఎలా అర్ధంతరంగా తనువు చాలించాడో అందరికీ తెలిసిందే.
ఇక్కడ ఒక ఆశ్చర్చకరమైన మరో విషాదాంతం గురించి మాట్లాడుకోవాలి. ఉదయ్ కిరణ్ చనిపోయినపుడు చాలామంది తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అతను అలా చేయాల్సింది కాదన్నారు. అతను తమతో మాట్లాడటమో.. తాము అతడితో మాట్లాడటమో చేసి ఉండాల్సిందని బాధ పడ్డారు. అందులో సీనియర్ నటుడు రంగనాథ్ కూడా ఒకరు. ఆయన ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరికైనా అలాంటి ఆలోచనలు వస్తే.. నిరాశలో ఉంటే తనను కలవాలని.. వాళ్ల ఆలోచనను తాను మారుస్తానని చెప్పారాయన. అలా అన్న వ్యక్తి రెండేళ్ల తర్వాత ఆత్మహత్య చేసుకోవడం పెద్ద షాక్. జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొని రాటుదేలి.. తన అనుభవాలతో అందరికీ మంచి చెబుతూ వచ్చిన వ్యక్తి ఒక దశలో ఒంటరితనంతోనో, మరో ఇబ్బందితోనో బలవన్మరణానికి పాల్పడ్డారు. డిప్రెషన్ ఎలాంటివారినైనా ఇలా తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి పురిగొల్పుతుందనడానికి ఇదో ఉదాహరణ.
Recent Random Post: