పదేళ్ల కిందట వచ్చిన ‘దబంగ్’ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినీ జీవితానికి కొత్త ఊపును ఇచ్చింది. ఆ సినిమా సంచలన విజయం సాధించి సల్మాన్ స్టార్ స్టేటస్ ను మరింత పెంచింది. భారీ వసూళ్లను సాధించడంతో పాటు వివిధ భాషల్లో ఆ సినిమా రీమేక్ అయ్యింది. ఆ సినిమా తర్వాత సల్మాన్ సినిమా స్థాయి పెరిగింది. ఆ హీరోని ఎంపరర్ ఖాన్ అంటూ బాలీవుడ్ మీడియా ఆకాశానికెత్తేసింది. ఆ తర్వాతి సినిమాల వసూళ్ళ ధాటి పెరిగింది.
అవన్నీ ఒక ఎత్తు అయితే దబంగ్ 2 వచ్చింది, ఈ మధ్యనే దబంగ్ 3 కూడా వచ్చింది. మరి నాలుగో పార్టు కూడా వస్తుందేమో! ఇలా దబంగ్ సినిమా సల్మాన్ కు పదేళ్ల సినీ లైఫ్ ను ఇవ్వగా.. ఆ దబంగ్ సినిమాను రూపొందించిన దర్శకుడు అభినవ్ కశ్యప్ ఆ తర్వాత ఏమయ్యాడో ఎవరూపట్టించుకోలేదు.
దబంగ్ కు రెండు సీక్వెల్స్ వచ్చినా వాటిల్లో ఒరిజినల్ చుల్ భుల్ పాండే సృష్టికర్తకు ప్రమేయం లేదు. దబంగ్ 2కు సల్మాన్ సోదరుడొకడు దర్శకత్వం వహించినట్టుగా ఉన్నాడు. మూడో పార్టుకు ప్రభుదేవ వీర డైరెక్షన్ చేశాడు. ఇంతకీ అభినవ్ కశ్యప్ దబంగ్ ల తదుపరి పార్ట్స్ లో ఎందుకు కనపడలేదు అనేది సగటు అభిమానికి మిగిలిపోయిన ప్రశ్న.
ఈ నేపథ్యంలో అభినవ్ కశ్యప్ స్పందించాడు. సల్మాన్ కు తను దబంగ్ వంటి సూపర్ హిట్ ను ఇస్తే, ఆ తర్వాత తనను అతడి కుటుంబం వేధించిందని, తనను బెదిరించిందని ఆ దర్శకుడు ఆరోపిస్తున్నాడు. తనను దబంగ్ ప్రాంచైజ్ లకు దూరం పెట్టడమే కాకుండా, తను వేరే వాళ్లతో చేసుకున్న సినిమాలను కూడా విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఈ దర్శకుడు ఆరోపిస్తున్నాడు. వృద్ధుడు అయిన సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రసిద్ధ రచయిత సలీమ్ ఖాన్ పేరును కూడా కశ్యప్ ప్రస్తావించాడు. సల్మాన్ తండ్రి, ఆయన సోదరులు కలిసి తనను వేధించారని.. తన కెరీర్ ను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆ దర్శకుడు అంటున్నాడు.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. దబంగ్ వంటి సంచలన సినిమాను తీసిన ఈ దర్శకుడు గత దశాబ్దంలో ఒకే ఒక సినిమా తీయగలిగాడు. ఆ సినిమా విడుదలకూ సల్మాన్ ఫ్యామిలీ అడ్డుపడిందట. మరి అంత పెద్ద హిట్టిచ్చిన ఈ దర్శకుడు పదేళ్లలో ఒకే ఒక సినిమా తీయగలిగాడంటే.. బాలీవుడ్ లో ఇతడిని తొక్కేసే ప్రయత్నాలు జరిగాయనేది స్పష్టం అవుతోంది. బాలీవుడ్ ఎవరుండాలనే అంశం గురించి డిసైడ్ చేస్తున్న వారిలో ఖాన్ లు కూడా ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో సల్మాన్ పై అభినవ్ కశ్యప్ ఆరోపణలు ఆసక్తిదాయకంగా మారాయి.
Recent Random Post:

















