
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ తమిళ హిట్ మూవీ ‘వీరం’కు రీమేక్ అన్నది మొదట్నుంచి తెలిసిన విషయమే. ఐతే ఎందుకోగానీ ఈ సినిమా రీమేక్ అని ఒప్పుకోవడానికి ఆ చిత్ర యూనిట్ ఇష్టపడలేదు. ‘వీరం’ తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్ అయి రిలీజ్ కావడం.. టీవీల్లో కూడా ప్రసారమైన నేపథ్యంలో ఆ చిత్రానికి ‘కాటమరాయుడు’ రీమేక్ అంటే జనాల్లో ఆసక్తి చచ్చిపోతుందని అనుకున్నారో ఏంటో?
మీడియాలో ఎక్కడైనా ‘కాటమరాయుడు’ రీమేక్ అని వార్తలొచ్చినా.. అదేం కాదంటూ ఖండనలు ఇచ్చారు ఇంతకుముందు. కానీ మీడియా కొంత నెమ్మదించినప్పటికీ ‘కాటమరాయుడు’ ‘వీరం’కు రీమేకే అన్న విషయంలో జనాల్లోకి వెళ్లిపోయింది.
తాజాగా ‘కాటమరాయుడు’ కథానాయిక శ్రుతి హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రం రీమేకే అనే విషయం కన్ఫమ్ చేసింది. దీంతో ‘కాటమరాయుడు’ టీం ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఐతే ‘కాటమరాయుడు’ రీమేక్ అంటూనే.. ఒరిజినల్‌తో దీన్ని పోల్చలేమని చెప్పింది శ్రుతి హాసన్. ‘‘పవన్ కళ్యాణ్ గారితో మళ్లీ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. పవన్ గారు.. గబ్బర్ సింగ్ సినిమా.. నాకు చాలా ప్రత్యేకంగా. ‘కాటమరాయుడు’ రీమేకే కానీ.. ఒరిజినల్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. రీమేక్ సినిమాను ఎవరూ ఉన్నదున్నట్లుగా తీసేయాలని అనుకోరు. ఇక్కడ లోకల్ ప్రేక్షకుల అభిరుచి కీలకమవుతుంది. వాళ్ల సెన్సిబిలిటీస్‌కు తగ్గట్లుగా సినిమాను మార్చాల్సి ఉంటుంది. ‘కాటమరాయుడు’ టీం అదే చేస్తోంది. ‘వీరం’తో పోలిస్తే ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. నా పాత్రను కూడా మార్చారు’’ అని శ్రుతి హాసన్ తెలిపింది.
Recent Random Post: