సిద్ శ్రీరామ్ పాటల విషయంలో అదొక్కటే కంప్లయింట్..!

సంగీత ప్రపంచంలో యంగ్ సింగర్ సిద్ శ్రీరామ్ ఒక సంచనలమనే చెప్పాలి. తన వాయిస్ తో మెస్మరైజ్ చేస్తున్న సిద్ ప్రస్తుతం దక్షిణాదిలో వరుస పాటలతో టాప్ లో దూసుకుపోతున్నారు. ఈ మధ్య కాలంలో శ్రీరామ్ పాట లేని సినిమా లేదనడంలో అతిశయోక్తి లేదు. చిన్నదైనా పెద్దదైనా ఏ సినిమా అయినా సరే సిద్ పాట ఉంటే చాలు ఆటోమేటిక్ గా సినిమాకు హైప్ వస్తోంది.

సిద్ శ్రీరామ్ సాంగ్ తో జనాలను థియేటర్లకు రప్పించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా సినిమాలు కేవలం యువ గాయకుడు పాడిన పాటల వల్ల హిట్ అయ్యాయని అనడంలో సందేహం లేదు. ఆయన గాత్రం నుంచి వచ్చిన ప్రతీ పాటా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబడుతుంటాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంటాయి.

అందుకే ప్రతీ సంగీత దర్శకుడు తన స్వరాలకు సిద్ గాత్రం తోడవ్వాలని కోరుకుంటారు. హీరోలు దర్శకనిర్మాతలు తమ చిత్రంలో శ్రీరామ్ తో సాంగ్ పాడించాలని ఆశ పడుతున్నారు. చిన్న చిత్రాల మేకర్స్ అయితే ఆయన పాటుంటే మంచి ఓపెనింగ్స్ కు డోకా ఉండదని భావిస్తున్నారు. అయితే సిద్ శ్రీరామ్ వాయిస్ తో మ్యాజిక్ చేస్తారని అంటునప్పటికీ.. తెలుగు పదాల ఉఛ్ఛారణలోలోపాలు మాత్రం ఇబ్బంది పెడుతుంటాయని భాషాభిమానులు కామెంట్స్ చేస్తుంటారు.

సిద్ పాటల్లో శ్రావ్యత వైవిధ్యం అతన్ని మిగతా గాయకుల కంటే ప్రత్యేకంగా నింపుతాయి. కాకపోతే తెలుగు పాటల్లో సాహిత్యాన్ని పలకడంలో తడబడుతుంటారు. ఇంతకముందు అతను పాడిన తెలుగు సూపర్ హిట్ సాంగ్స్ విషయంలో ఇదే కంప్లయింట్ వచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం యువ గాయకుడు పాడిన ‘కళావతి’ పాట విషయంలో సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

‘వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయ.. ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా మొగినాయా.. ఓ ఇందు సోయా’ అంటూ సిద్ శ్రీరామ్ పాడిన ‘కళావతి’ పాట యూట్యూబ్ లో తక్కువ సమయంలో మిలియన్ల వ్యూస్ అత్యధిక లైక్స్ తో దూసుకుపోతోంది. ఎస్ ఎస్ థమన్ ఖాతాలో మరో చార్ట్ బస్టర్ సాంగ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.

కానీ ఈ పాటలో దూకినాయా – మోగినాయా లాంటి పదాలను విడగొట్టి ఒత్తులు చేర్చి సిద్ శ్రీరామ్ పాడిన తీరు భాషాభిమానులకు రుచించడం లేదు. ట్యూన్ మరియు సింగర్ గొంతు ఎంత బాగున్నా.. పలికే విధానం కూడా చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటే పాటలు మరింత బ్యూటిఫుల్ గా ఉంటాయని అంటున్నారు.

ఏదేమైనా సంగీత దర్శకులు – గీత రచయితలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భాషాభిమానులు సూచిస్తున్నారు. పర భాషా గాయకులతో పాటలు పాడించినప్పుడు.. డబ్బింగ్ చెప్పించినప్పుడు తెలుగు భాష ఖూనీ అవకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.