
2012, 2013 సంవత్సరాలకు నంది అవార్డుల్ని ఈ మధ్యే ప్రకటించి ఆశ్చర్యపరిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐతే రాష్ట్ర విభజన జరగడం వల్లే ఏపీ సర్కారు ఇంత ఆలస్యంగా అవార్డులు ప్రకటించాల్సి వచ్చిందన్నది అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ తమిళనాడు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సినీ అవార్డుల తీరు చూస్తే షాకవ్వక తప్పదు.
తొమ్మిదేళ్ల నుంచి అవార్డుల ఊసే ఎత్తని ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారిగా ఆరేళ్ల కాలానికి అవార్డులు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. 2009 నుంచి 2014 వరకు ఒకేసారి అవార్డులు అందజేయబోతోంది తమిళనాడు ప్రభుత్వం. ఐతే ఎప్పుడో మరిచిపోయిన సినిమాలకు సంబంధించి ఇప్పుడు అవార్డులు ప్రకటించడంతో అక్కడి జనాల్లో ఏమంత ఆసక్తి కనిపించడం లేదు. సినీ జనాలు కూడా ఈ అవార్డుల్ని లైట్ తీసుకుంటున్నారు. పైగా ఇప్పుడు తమిళనాట ఉన్న ప్రభుత్వం విషయంలో కూడా జనాలకు సదభిప్రాయం లేకపోవడం కూడా ఈ అవార్డుల్ని తేలిగ్గా తీసుకోవడానికి మరో కారణం.
తెలుగు ప్రేక్షకులు కనెక్టయ్యే కొందరు నటీనటులు.. సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. అక్కినేని వారి కాబోయే కోడలు సమంత 2012 సంవత్సరానికి ఉత్తమనటిగా ఎంపికైంది. ‘నీదా యన్ పొన్ వసంతం’ (ఎటో వెళ్లిపోయింది మనసు) చిత్రానికి ఆమె అవార్డు దక్కించుకుంది.
‘రాజా రాణి’ సినిమాకు నయనతారకు అవార్డు దక్కింది. మణిరత్నం ‘రావణ్ (విలన్) సినిమాకు గాను విక్రమ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ‘మైనా’ (ప్రేమఖైదీ) సినిమాకు అమలా పాల్ కూడా ఉత్తమ నటిగా ఎంపికైంది. ‘మైనా’ ఉత్తమ చిత్రంగా కూడా ఎంపికైంది. రెహమాన్.. యువన్ శంకర్ రాజా.. హ్యారిస్ జైరాజ్ ఉత్తమ సంగీత దర్శకులకుగా ఎంపికయ్యారు.
Recent Random Post: