దుమారం రేపుతున్న గాయకుడి వ్యాఖ్యలు

చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు తెల్లవారుజామున అజాన్ వినిపించడం మామూలే. ముస్లింలు ఆ సమయంలో చేసే నమాజ్‌నే అజాన్ అంటారు. ఆ శబ్దం కొందిరికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొందరు దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఐతే అజాన్ గురించి బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అజాన్ ద్వారా బలవంతంగా నిద్ర లేపే కార్యక్రమం ఎంతవరకు సమంజసమని అతను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు.

తాను ముస్లింను కాదని.. కానీ ప్రతిరోజూ తెల్లవారగానే అజాన్‌తోనే నిద్ర లేస్తున్నానని సోనూ చెప్పాడు. ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడు అంతమవుతుందో ఏమో అని వ్యాఖ్యానించాడు సోనూ. మహ్మద్ ప్రవక్త ఉన్నపుడు కరెంట్ లేదని.. అప్పుడు ఈ గోల లేదని.. ఎప్పుడైతే ఎడిసన్ బల్బును కనిపెట్టాడో అప్పటి నుంచే ఈ గోల మొదలైందని సోనూ పేర్కొన్నాడు. అంతటితో ఆగని సోనూ.. గుళ్లు, గురుద్వారాల నుంచి మాత్రం ఇలాంటి శబ్దాలు ఉండవన్నాడు. ఇది నిజమా కాదా అని ప్రశ్నించాడు. మతం అంటే ఓ గూండాగిరి అని అతను తీర్మానించాడు.

ఈ ట్వీట్లు తీవ్ర దుమారమే రేపాయి. ముస్లింలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అతడిపై ట్విట్టర్లో దాడికి దిగారు. సోనూ నిగమ్ వల్ల నటుడు సోనూ సూద్ కూడా ఇబ్బంది పడ్డాడు. పేర్లు ఒకేలా ఉండటంతో జనాలు సోనూ సూద్‌ను కూడా తిట్టిపోయడం మొదలుపెట్టారు.


Recent Random Post: