
హీరోగా నిలదొక్కుకుందామని దాదాపు రెండు దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు నాగార్జున మేనల్లుడు సుమంత్. కానీ ఇప్పటికీ పోరాటం తప్పట్లేదు. మధ్యలో ఒకట్రెండు విజయాలు దక్కినా.. వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. మూడేళ్ల కిందట ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా దారుణమైన ఫలితాన్నివ్వడంతో రెండేళ్లకు పైగా కనిపించకుండా పోయాడు సుమంత్.
గత ఏడాది ‘నరుడా డోనరుడా’తో జనాల్లో కొంచెం క్యూరియాసిటీ తీసుకురాగలిగాడు కానీ.. ఆ సినిమా కూడా అతణ్ని తీవ్ర నిరాశకు గురించి చేసింది. ఈ చిత్రానికి సుమంత్ నిర్మాత కూడా. ఈ సినిమా రిజల్ట్ చూశాక సుమంత్ ఇక సినిమాలు మానేస్తాడేమో అన్న సందేహాలు కూడా కలిగాయి.
కానీ కొంచెం గ్యాప్ తర్వాత సుమంత్ మళ్లీ సినిమా మొదలుపెట్టేశాడు. గౌతమ్ తిన్ననూరి అనే కొత్త దర్శకుడితో సుమంత్ ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా కొత్తవాడే. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ అనే బేనర్ మీద రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. సుమంత్ సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటించనుంది. శ్రవణ్ సంగీతాన్నందించనున్నాడు.
మార్చి చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్కు వెళ్లబోతోందీ చిత్రం. దర్శకుడే ఈ చిత్రానికి రచయిత కూడా. కథ, మాటలు, స్క్రీన్ ప్లే క్రెడిట్లు కూడా అతడివే. సుమంత్ ట్రాక్ రికార్డు చూసి అతడితో ఓ కొత్త నిర్మాత సినిమా తీయడానికి రెడీ అవడం విశేషమే. ‘నరుడా డోనరుడా’ దెబ్బ నుంచి సుమంత్ కొంచెం త్వరగానే కోలుకుని తన తర్వాతి సినిమాను మొదలుపెట్టాడు. మరి ఈ చిత్రమైనా అతడి రాతను మారుస్తుందేమో చూద్దాం.
Recent Random Post: