
విజయ్ ఆంటోనీ.. ఇంకే టైటిలూ దొరకలేదా?
మణిరత్నం తమిళ సినిమాలన్నీ ఎప్పట్నుంచో తెలుగులోకి డబ్ అవుతున్నాయి. ఐతే తన ప్రతి సినిమాకూ సాధ్యమైనంత వరకు చక్కటి తెలుగు టైటిళ్లు ఉండేలా చూసుకుంటాడాయన. డబ్బింగ్ విషయంలోనూ చాలా శ్రద్ధ పెడతాడు. అందుకే మన ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలకు బాగా కనెక్టవుతారు. ఇలాంటి శ్రద్ధ ఎవరైనా చూపించాల్సిందే.
టైటిళ్ల విషయంలో జాగ్రత్త పడాల్సిందే. ఐతే ఆ మధ్య సూర్య ‘సింగం’ సిరీస్‌లో తెరకెక్కిన రెండో సినిమాకు ‘సింగం’ అనే టైటిల్ పెట్టి వదిలేశాడు. ‘సింగం’ అన్నది తమిళ పదం. దాన్ని తెలుగు సినిమాకు పేరుగా ఎలా నిర్ణయించారో ఏంటో? ఇప్పుడు విజయ్ ఆంటోనీ కొత్త సినిమా విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు.
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ ఆంటోనీ.. ఆ తర్వాత ‘బేతాళుడు’ సినిమాతో పలకరించాడు. ఇప్పుడు అతడి లేటెస్ట్ మూవీ ‘యమన్’ కూడా తెలుగులోకి అనువాదమవుతోంది. తెలుగు వెర్షన్ కోసం వేరే పేరేమీ ఆలోచించకుండా ‘యమన్ అని పెట్టేసి ప్రమోషన్ మొదలుపెట్టేశారు. ‘యమన్ అంటే ‘యముడు అని అర్థం.
అదే టైటిల్ పెట్టడానికి ఇబ్బంది ఉంటే ‘యమ’ అనో.. ‘యమధర్మరాజు’ అనో పెట్టుకోవచ్చు. కానీ అలా కాకుండా ‘యమన్’ అనే టైటిలే తెలుగుకూ ఫిక్స్ చేసేశారు. ఫిబ్రవరి 11న ఆడియో వేడుక చేయబోతున్నారు. జీవా శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘రోబో-2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. తెలుగులో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను అందిస్తున్నాడు.
Recent Random Post: