అమెరికాలో ఎన్నారైలు తెలుగు మాట్లాడొద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యామా అని వెలువ‌డుతున్న కొత్త ఆదేశాల‌తో ర‌క‌ర‌కాల హెచ్చ‌రిక‌లు, స‌ల‌హాలు-సూచ‌న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అందులో ఒక‌టి ఇది. అమెరికాలో ఎన్నారైలు తెలుగు మాట్లాడొద్దు! ఇలాంటి హెచ్చ‌రిక చేసింది ఎవ‌రో కాదు. సాక్షాత్తు తెలుగువారే. అదేంటి మ‌న‌వాళ్లు మ‌న‌భాష మాట్లాడ‌వ‌ద్ద‌ని ఎందుకు ఆదేశించారు అంటే…అదే ఆస‌క్తిక‌రం. అమెరికాలో నెల‌కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యం, తెలుగు వ్య‌క్తి కూచిబొట్ల శ్రీ‌నివాస్ హ‌త్య నేప‌థ్యంలో తెలంగాణ అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ (టాటా) ఈ సూచ‌నను మ‌న వారి సంక్షేమం రీత్యా వెల్ల‌డించింది. అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు హిందీలోగానీ, ఏదైనా ఇతర భారతీయ భాషలో మాట్లాడుకోవద్దు, దానివల్ల మీకు తీవ్ర ఇబ్బందులు రావచ్చు అని అంటూ యూఎస్ లోని మ‌న ఎన్నారైల‌కు సూచించింది.

మిగతా విషయాల కన్నా ప్రాణం చాలా విలువైనదని చెప్తూ టాటా ప్రధాన కార్యదర్శి విక్రమ్ జంగమ్ కొన్ని సూచ‌న‌లు చేశారు. ఇవే అవి…

– ప‌రిస్థితులు బాగాలేనందున మన మాతృ భాషలో మాట్లాడటాన్ని వీలైనంత‌గా త‌గ్గించుకోండి. బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడుకోగలరేమో చూసుకోండి. దాన్నే త‌ప్ప‌నిస‌రి చేసుకోండి.
– ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, ఎదురు మాట్లాడకుండా అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి.
– ఇటీవ‌లి కాలంలో బ‌హిరంగ ప్ర‌దేశాల‌తో పాటు ఏకాంత ప్రదేశాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే  ఒంటరిగా వెళ్ళడం కానీ, ఒంటరిగా ఉండటం కానీ చేయకండి.
-త‌ప్ప‌నిస‌రి బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో, ఇంటి ప‌రిస‌రాల్లో మీ పరిసరాలను గమనిస్తూ ఉండండి, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే జాగ్ర‌త్త‌ప‌డండి.
– అత్యవసర పరిస్థితుల్లో 911కు ఫోన్ చేయడానికి ఆలోచించ‌కండి. స‌మాచారం చేర‌వేసి స‌హాయం కోర‌డం  ద్వారా అధికారులు వచ్చి సహాయపడతారు.


Recent Random Post: