
తరుణ్ భాస్కర్.. ‘పెళ్లిచూపులు’ సినిమాకు దర్శకుడు. ఆ సినిమా రిలీజైనప్పటి కంటే కూడా ఇప్పుడు ఈ పేరు ఎక్కువ చర్చనీయాంశమవుతోంది. ఐఫా అవార్డుల వేడుకలో ‘పెళ్లిచూపులు’ లాంటి చిన్న సినిమాకు కాకుండా టీఆర్పీ కోసమే ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’కు అవార్డు ఇచ్చారన్న అర్థం వచ్చేలా అతను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిజానికి ఆ ఇంటర్వ్యూలో తరుణ్.. ఎన్టీఆర్ అభిమానులు అఫెండయ్యేలాగా ఏమీ మాట్లాడలేదు కానీ.. సినీ పరిశ్రమలో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ.
తరుణ్ మాట తూలడం.. కొంచెం హద్దులు దాటి మాట్లాడటం ఇది తొలిసారి కాదు. ‘పెళ్లిచూపులు’ 50 రోజులు పూర్తి చేసుకున్న సమయంలో అతను ఒక లెంగ్తీ ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు. ఈ సినిమాను ఎంతమంది వెనక్కి లాగారో.. దీని గురించి ఎంత తేలిగ్గా మాట్లాడారో చెప్పే క్రమంలో అతడి మాటలు కొంచెం శ్రుతి మించాయి. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాకు అవార్డులివ్వలేదంటూ ఐఫా, మా టీవీ నిర్వాహకుల్ని ఉద్దేశించి ఎలా మాట్లాడాడో కూడా గుర్తుండే ఉంటుంది. కెరీర్లో ఇప్పుడే తొలి అడుగులు వేస్తున్న దర్శకుడు.. ఒక్క సినిమాకే ఇలా ఔట్ స్పోకెన్ అవ్వడం సమర్థనీయం అనిపించుకోదు. అపజయమే లేకుండా సినిమా సినిమాకూ అసాధారణంగా ఎదిగిపోతున్న రాజమౌళి ఎంత వినమ్రంగా ఉంటాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
తరుణ్ భాస్కర్ తీసింది మంచి సినిమానే. ఆ సినిమా గొప్ప విజయం సాధించిన మాటా వాస్తవమే. ‘పెళ్లిచూపులు’ ఒక ట్రెండ్ సెట్టర్ అనడంలో.. ఆ సినిమా ఎందరికో స్ఫూర్తినిచ్చిందనడంలోనూ సందేహం లేదు. కానీ తరుణ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
తొలి సినిమా హిట్టయ్యాక గాల్లో తేలిపోయి.. ఆ తర్వాత రెండో సినిమాకే కింద పడి ‘వన్ ఫిల్మ్ వండర్’గా మిగిలిపోయిన దర్శకులు చాలామంది ఉన్నారు టాలీవుడ్లో. తరుణ్‌కు అసలు పరీక్ష ముందుంది. రెండో సినిమాతోనూ అతను తనేంటో రుజువు చేసుకోవాలి. ఆ తర్వాత కూడా నిలకడగా సక్సెస్‌లు ఇవ్వాలి. ఈలోపే లేని పోని వివాదాల్లో చిక్కుకుంటే మున్ముందు అతడికే కష్టమవుతుంది.
Recent Random Post:

















