బాహుబలి ఏంటనేది ఇప్పుడు చూస్తారు

”మొదటి భాగంలో చాలా ప్రశ్నలున్నాయి. సమాధానాలు చూపించని సినిమా ఇంత హిట్‌ ఎలా అయింది?” ఈ అనుమానం వ్యక్తం చేసింది మరెవరో కాదు, దర్శకుడు వి.వి. వినాయక్‌. ఆయనొక్కడే కాదు, చాలా మంది ‘బాహుబలి’ మొదటి భాగంతో సంతృప్తి చెందలేదు. అయితే ఈ స్కేల్‌లో ఒక సినిమా రూపొందడమనేది భారతీయ చలన చిత్ర చరిత్రలో గతంలో జరగకపోవడంతో ఆ అద్భుతాన్ని వీక్షించడానికి జనం ఎగబడ్డారు. సగం సినిమానే చూపించినా, ఎమోషన్స్‌ పెద్దగా క్యారీ కాకపోయినా బాహుబలి 1 బ్లాక్‌బస్టర్‌ అయిపోయింది.

అయితే అసలు ‘బాహుబలి’ని ఇంకా ఎవరూ చూడలేదని, రాజమౌళి కథ చెప్పిన తర్వాత ఆ ఎమోషన్‌ తనని అయిదు రోజుల పాటు వెంటాడిందని ప్రభాస్‌ చెబుతున్నాడు. అది రెండవ భాగంలోనే చూస్తారని, బాహుబలి కేవలం విజువల్‌ వండర్‌ మాత్రమే కాదని, ఎమోషనల్‌గా హై ఇచ్చే అంశాలు చాలా వున్నాయని, ఈ చిత్రం చూసిన తర్వాత ఆ ఇంపాక్ట్‌ ప్రేక్షకులపై చాలా రోజుల పాటు వుంటుందని ప్రభాస్‌ అంటున్నాడు. ఈ చిత్ర బృందం మొత్తం ఇదే కాన్ఫిడెన్స్‌తో వుంది.

ఏమీ లేని బాహుబలి మొదటి భాగాన్ని ఆ స్థాయిలో ఎగబడి చూస్తే, అన్ని అంశాలున్న ఈ చిత్రాన్ని ఎలా చూస్తారనేది వారి ఊహలకి కూడా అందడం లేదు. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా వెయ్యి కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించే చిత్రం ఇదే అవుతుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. ఒక్క తెలుగు వర్షన్‌ నుంచే రెండు వందల యాభై కోట్ల షేర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారని ఈ చిత్రానికి జరుగుతోన్న థర్డ్‌ పార్టీ బిజినెస్‌ని బట్టి తెలుస్తోంది.


Recent Random Post: