
అధికారంలో ఉన్నామన్న దర్పమో.. ఏం చేసినా నడిచిపోతుందన్న బరి తెగింపో కానీ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారపక్షానికి చెందిన నేత కొడుకు నిర్వాకం ఇప్పుడు అందరి చేత తిట్టిపోసేలా చేస్తోంది. కేవలం రూ.30 టోల్ ఫీజు చెల్లించే విషయంలో పవరున్న పార్టీ నేతకు అహం అడ్డొచ్చింది. తమనే టోల్ ఫీజు కట్టమని అడుగుతారా? అంటూ నిలదీయటమే కాదు.. కట్టాలన్న మాటకు కత్తితో వెంటపడి మరీ పొడిచిన వైనం సంచలనంగా మారింది.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ఉదంతం టీఆర్ ఎస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి మద్దగోని రామ్మోహన్ రావు కుమారుడు మనీష్ గౌడ్ అతని స్నేహితులు ఒక బర్త్ డే పార్టీకి వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో కడ్తాల్ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు.
అక్కడి సిబ్బంది టోల్ ఫీజు కింద రూ.30 కట్టాలన్నారు. అందుకు ససేమిరా అన్న వారు టోల్ ఫీ కట్టకపోతే వదిలేది లేదన్న సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కొడుకునే ఆపుతారా? అంటూ అబద్ధమాడిన వారు వీరంగం వేశారు. టోల్ గేట్ సూపర్ వైజర్ మహేశ్ గౌడ్ ను వెంటపడి కత్తితో గాయపరిచారు. తర్వాత అందరూ కలిసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు పట్టుకున్నారు.
అయితే.. ఇంత చేసిన మహేశ్ పొలిటీషియన్ కొడుకు కావటంతో అతడ్ని తప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినా.. ఈ వ్యవహారం మీడియాలో రావటంతో అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎట్టకేలకు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కేసు కట్టారు. మేజిస్ట్రేట్ ఎదురట హాజరుపర్చగా వారికి 11 రోజుల రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే.. కత్తిపోట్లకు గురైన మహేశ్ పరిస్థితి బాగానే ఉందంటున్నారు.
Recent Random Post: