వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా కుర్రాడు?

‘అఖిల్’ కొట్టిన దెబ్బ నుంచి త్వరగానే కోలుకుని మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ చేశాడు వి.వి.వినాయక్. ఈ సినిమా అనూహ్యమైన కలెక్షన్లు తెచ్చింది కానీ.. దర్శకుడిగా వినాయక్‌కు గొప్ప పేరేమీ లేదు. చాలా వరకు తమిళ వెర్షన్‌ను ఉన్నదున్నట్లు దించేయడం.. దానికి అంతగా అతకని కామెడీని జోడించడం మినహా దర్శకుడిగా వినాయక్ ముద్రేమీ కనిపించలేదు ఇందులో.

ఎలాగైతేనేం ఒక మెగా హిట్ అయితే వినాయక్ ఖాతాలో పడింది. అతను సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. దీని తర్వాత వినాయక్ ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ హీరోగా వినాయక్ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది కానీ.. అదేమీ లేదని తేలిపోయింది.

తాజా సమాచారం ప్రకారం వినాయక్ మళ్లీ ఓ మెగా హీరోతోనే సినిమా చేస్తాడట. ఆ హీరో మరెవరో కాదు.. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్’ చేస్తున్న సాయిధరమ్.. వినాయక్‌తో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. కమర్షియల్ సినిమాలే చేస్తున్నప్పటికీ ఫుల్ మాస్ మసాలా సినిమాలేవీ చేయలేదు సాయిధరమ్. ఒకసారి వినాయక్ దర్శకత్వంలో ఆ తరహా సినిమా ట్రై చేయాలని భావిస్తున్నాడు.

ఐతే ఈ సినిమాకు ఇంకా కథేమీ రెడీ కాలేదు. వినాయక్ సొంతంగా కథలు రాసుకోవడం ఎప్పుడో మానేశాడు. సాయిధరమ్ కోసం తన రచయితల బృందంతో కథ రెడీ చేయించే పనిలో ఉన్నాడట. ‘విన్నర్’ నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.


Recent Random Post: