బాహుబలిది దోపిడీ కాదా?

‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా టికెట్ల కోసం ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. రిలీజ్ సమయానికి టికెట్ల కోసం పెద్ద గొడవలే జరిగిపోతాయేమో. సౌత్.. నార్త్ అని తేడా లేదు అన్ని చోట్లా టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు.

ఐతే ప్రేక్షకుల్లో ఉన్న ఈ ఆసక్తిని ‘బాహుబలి’ హిందీ నిర్మాత కరణ్ జోహార్ తెలివిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ‘బాహుబలి: ది బిగినింగ్’ చూస్తే.. ‘ది కంక్లూజన్’ టికెట్ గ్యారెంటీ అనే ఆఫర్ ప్రకటించాడు కరణ్. దీన్ని బాహుబలి ప్రేమికులు బంపరాఫర్‌గానే భావిస్తున్నారు.

కానీ ఇలా చేయడం ఒకరకమైన దోపిడీనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘బాహుబలి-2’ టికెట్ విషయంలో టెన్షన్ పడుతున్న అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకునేలా.. మరోసారి ‘బాహుబలి: ది బిగినింగ్’తో కాసుల పంట పండించుకునే ఉద్దేశంతోనే కరణ్ ఈ ప్లాన్ వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలా చేయడం ప్రేక్షకుల్ని పరోక్షంగా దోచుకోవడమే అంటున్నారు. ఎలాగైనా సాధ్యమైనంత త్వరగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ చూడాలన్న ఆతృతతో దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రేక్షకులకు ఆ మూవీ టికెట్ కోసమైనా ‘ది బిగినింగ్’ చూడాలన్న ఆలోచన కలిగేలా చేస్తున్నారు.

కానీ ఈ సినిమా చూస్తే నిజంగా ‘ది కంక్లూజన్’ టికెట్‌కు గ్యారెంటీ ఉంటుందా.. ఉంటే ఎన్ని రోజుల్లోపు టికెట్ దక్కించుకునే అవకాశం కల్పిస్తారన్నది కీలకం. మరి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా బంపరాఫర్ అంటూ ప్రచారం చేసేస్తున్నారు. అందుకే జనాల బలహీనతల్ని క్యాష్ చేసుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారంటూ ‘బాహుబలి’ టీంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Recent Random Post: