వైఎస్ షర్మిల నటిస్తోన్న ‘పొలిటికల్’ రీమేక్.!

దర్శకుడు మారలేదు.. నిర్మాణ సంస్థ కూడా మారలేదు.. అదే వ్యూహం.. అవే సన్నివేశాలు.. మరి, ఈ పొలిటికల్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందా.? వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర గురించి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఇది.

2019 ఎన్నికల్లో గెలుపు కోసం, అత్యంత పకడ్బందీగా ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిశోర్ సలహా తీసుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం విదితమే. ఆ పాదయాత్ర సూపర్ హిట్ అయ్యింది.. బంపర్ విక్టరీ సాధించారు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఏ రోడ్ల మీద అయితే పాదయాత్ర చేశారో.. ఆ రోడ్లు సర్వనాశనమైపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వాటిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోలేదు ముఖ్యమంత్రి అయ్యాక. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన అనేక హామీలు కాలగర్భంలో కలిసిపోయాయి.

ఇక, ఇప్పుడు షర్మిల పాదయాత్ర కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందా.? అంటే వైఎస్ జగన్ పాదయాత్ర వేరు, షర్మిల పాదయాత్ర వేరు. తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు అధికారం కోసం కుమ్ములాడుతున్నాయి. అసలు షర్మిల పార్టీని ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు.

తన దారిన తాను షర్మిల పాదయాత్ర చేసుకుంటూ పోతోంటే, కనీసం మీడియాలో ఓ మూల అయినా ఆ వార్త కనిపించని పరిస్థితి. కానీ, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరతామంటున్నారు షర్మిల. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. అంటూ కొత్త కుంపటి పెట్టినా, తెరవెనుక కథ నడిపిస్తున్నది స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

2019 ఎన్నికల సమయంలో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షర్మిల ఏపీలో సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే. దానికిలా రుణం తీర్చుకుంటున్నారన్నమాట. అన్నట్టు, అన్న కోసం షర్మిల గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం విదితమే. ఆ విషయంలో వైఎస్ జగన్ కంటే షర్మిల ఘనతే ఎక్కువ.

సేమ్ టు సేమ్.. అస్సలు స్కెచ్ మారలేదు.. మరి, జనం ఇవన్నీ గమనించకుండా వుంటారా.? అందుకే, జనం కనిపించడంలేదు. ఇరుకు దారుల్లో నడకలు.. జనాన్ని సమీకరించేందుకు నానా పాట్లూ.. వెరసి, అలా అలా సాగుతోంది షర్మిల పాదయాత్ర.