ఏడాదిలో రోడ్లు బాగు చేసి విమర్శలకు సమాధానం చెప్పాలి: సీఎం జగన్

రహదారుల విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను చాలెంజ్ గా తీసుకుని ఏడాదిలో గణనీయమైన ప్రగతి చూపించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లుగా తయారు చేయాలని అన్నారు. వంతెనలు పూర్తై అప్రోచ్ రోడ్లు లేనివి.. పెండింగ్ వంతెనలు, ఆర్వోబీ పనులు త్వరగా చేపట్టాలని ఆదేశాంచారు. రోడ్లు, అభివృద్ధి పనులపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..

‘రాష్ట్రంలో రోడ్లు బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోంది. ఇందుకోసం అధికారులు శ్రమిస్తున్నారు. పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు సామెతలా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆర్ అండ్ బీ రోడ్ల కోసం 2500 కోట్లు.. పీఆర్ రోడ్ల కోసం 1072.92 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్ల కోసం చేసే ఖర్చు ప్రజలకు తెలియాలి. నాడు-నాడు పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలి. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత ప్రమాణాలను అనుసరించి రోడ్లు వేయాల’ని సీఎం జగన్ అన్నారు.