డిక్లరేషన్‌ రగడ.. వైఎస్‌ జగన్‌పై హైకోర్టులో పిటిషన్‌

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన సందర్శన సందర్భంగా అన్యమతస్తుడైన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, టీటీడీ నిబంధనల్ని పాటించలేదంటూ రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ‘డిక్లరేషన్‌’ ఇవ్వకపోవడంపై వైఎస్‌ జగన్‌కి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. డిక్లరేషన్‌ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని, అందువల్ల సీఎంగా ఆయన ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ హైకోర్టులో కో-వారెంటో పిటిషన్‌ దాఖలయ్యింది.

మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింగాల్‌ సైతం ఏ అధికారంతో ఆయా పోస్టుల్లో కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలనీ కోరుతూ గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన రైతు అలోకం సుధాకర్‌బాబు పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

అంతే కాదు, వైఎస్‌ జగన్‌ సహా పిటిషన్‌లో పేర్కొన్న వ్యక్తులు ఆయా బాధ్యతలు నిర్వర్తించకుండా నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు పిటిషన్‌ దారుడు. అయితే, టీటీడీ డిక్లరేషన్‌ విషయమై భిన్న వాదనలున్నాయి. డిక్లరేషన్‌ అనేది టీటీడీ నియమావళిలో వున్న మాట వాస్తవమే అయినా, డిక్లరేషన్‌లో సంతకం చేయాలా.? వద్దా.? అన్నది ఆయా వ్యక్తుల విజ్ఞత మాత్రమేనన్నది ఓ వాదన.

మరోపక్క, వైఎస్‌ జగన్‌ అన్యమతస్తుడు కాదనీ.. ఆయన హిందువు కాదనడానికి ఎక్కడా సాక్ష్యాధారాలు లేవని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, వైఎస్‌ జగన్‌ కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే క్రైస్తవ మతాన్ని స్వీకరించిందన్నది నిర్వివాదాంశం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అయినా, ఆయన వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించినప్పుడు ఈ తరహా వివాదాలు రాలేదు.

అయితే, డిక్లరేషన్‌ పేరుతో రాజకీయం మొదలు పెట్టింది వైసీపీనే. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు, ఆ తర్వాత కొడాలి నాని వివాదాస్పద కామెంట్లు.. వెరసి, వివాదం ముదిరి పాకాన పడింది. ఇప్పుడు విషయం కోర్టుకి వెళ్ళింది గనుక, కోర్టు ఈ వివాదంపై ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. టీటీడీ నియమ నిబంధనల్ని ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ ఛైర్మన్‌, అధికారులే పాటించకపోతే, సామాన్యులు ఆ నిబంధనల్ని ఎలా పాటిస్తారు.? అన్నది కూడా చర్చనీయాంశమే ఇక్కడ.


Recent Random Post: