‘అదెందుకో’ సినిమాలోనే చూడాలి: జ్యోతిక

ఎలాగూ సెన్సార్‌ అయ్యే పదమే.. కానీ, టీజర్‌లో వాడేశారు. టీజర్‌లో ఎందుకు వాడేశారంటే, సినిమా మీద హైప్‌ తీసుకురావడానికి. ‘నాచియార్‌’ తమిళ సినిమా కోసం ఏకంగా జ్యోతికతో ‘పరమ బూతు’ డైలాగులు చెప్పించేశాడు దర్శకుడు బాలా. అందరికీ తెల్సిన విషయమే బాలా సినిమాలు చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. ఈ క్రమంలోనే ఆ సహజత్వం కోసం కొంచెం ‘ఓవర్‌ ది బోర్డ్‌’ వెళ్ళడం బాలాకి అలవాటు.

జ్యోతిక అంటే తెలుసు కదా.? చిరంజీవితో ‘ఠాగూర్‌’ సినిమాలోనూ, నాగార్జునతో ‘మాస్‌’ సినిమాలోనూ, రవితేజతో ‘షాక్‌’ సినిమాలోనూ నటించింది. తమిళంలో అయితే నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అన్పించుకుందీ బొద్దుగుమ్మ ఒకప్పుడు. హీరోయిన్‌ నగ్మా చెల్లెలు, ప్రస్తుతం తమిళ హీరో సూర్యకి సతీమణి కూడా. అలాంటి జ్యోతిక నుంచి, ‘పచ్చి బూతు’ మాటల్ని వినడం ఒకింత ఇబ్బందికరంగానే అన్పిస్తుంటుంది. అయినాసరే, సినిమా సినిమానే.. అని లైట్‌ తీసుకునేవారెంతమంది.?

అందుకే, జ్యోతిక ‘నాచియార్‌’ టీజర్‌లోని ఒక్క డైలాగ్‌తో వివాదాల్లోకెక్కేసింది. ఈ వివాదంపై స్పందించిన జ్యోతిక, ‘అది సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం. దర్శకుడు చెప్పేటప్పుడు వినడానికే ఇబ్బందిగా అన్పించింది. కానీ, సీన్‌లోని టెంపో అలాంటిది.. తప్పలేదు. సెన్సార్‌ వుంది కదా.. తప్పయితే తీసేస్తుంది..’ అంటూ జ్యోతిక క్లారిటీ ఇచ్చింది.

ఆ మధ్య తెలుగులో ‘బిజినెస్‌మేన్‌’ సినిమా వచ్చింది. ‘ముంబైని డాష్‌ డాష్‌ పోయించడానికి వచ్చా’ అంటాడు హీరో మహేష్‌బాబు. ఆ తర్వాత ఆ డైలాగ్‌ సినిమాలో ‘మ్యూట్‌’ అయిపోయిందనుకోండి.. అది వేరే విషయం. కానీ, అప్పట్లో అది చాలా పెద్ద వివాదానికి కారణమయ్యింది. మొన్నీమధ్యనే ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలోనూ ఇలాంటిదే ఓ మాట వివాదాస్పదమయ్యింది. సినిమా అన్నాక వివాదం తప్పదు. ఒక్కోసారి చిన్న చిన్న వివాదాలే సినిమా పబ్లిసిటీకి భలేగా ఉపయోగపడ్తాయ్‌.


Recent Random Post: