అదే పని కాపులు చేస్తే ఊరుకుంటారా?

ఏపీలో ఉన్న కాపు నాయకుల్లో ఇప్పుడు ప్రభుత్వం మీద ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం గానీ పోలీసులు గానీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరులు ప్రజల్లోనే చీలికలు తెచ్చేలాగా పరిణమిస్తున్నాయని కాపునేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కాపుల పట్ల ఒక రకంగా, ఇతర కులాల పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నదని.. కాపుల మీద ప్రజలందరిలోనూ దురభిప్రాయం ఏర్పడడానికి కారణం అవుతున్నదని వారు వాదిస్తున్నారు. ఇదంతా వారు నిర్వహించదలచుకుంటున్న కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు తిరస్కరించడం వల్లనే జరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు.

ఇంతకూ ఏం జరిగిందంటే.. బీసీకుల సంఘాలు అన్నీ కలిసి.. చాలా పెద్దస్థాయిలో రాజమండ్రిలో బీసీ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించాయి. బీసీ గర్జనతో పాటూ, కార్తీక వన సమారాధన అని కూడా దానికి పేరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య హాజరై.. బీసీ కులాలు ఐక్యంగా ఉండి ఓటు బ్యాంకుగా మారాలని, తమకోసం తామే ఓ పార్టీ స్థాపించుకోవాలని పిలుపు ఇచ్చారు.

ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే.. గర్జన పేరుతో బీసీ సంఘాలు మీటింగు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిన పోలీసులు , ముద్రగడ పద్మనాభం గానీ, ఇతర కాపు నాయకులు గానీ.. సమావేశాలు, సభలు పెట్టాలన్నా, పాదయాత్ర చేయాలన్నా… కనీసం తమ అనుచరుల్ని కలవడానికి వెళ్లాలన్నా ఎందుకు అనుమతి ఇవ్వకుండా అరెస్టులు చేస్తారనేది కాపు నాయకులు ప్రశ్నగా ఉంది.

ముద్రగడ ఇంట్లోంచి కాలు కదిపితే చాలు.. పోలీసు యాక్షన్ ఉంటోంది. ఒకవైపు బీసీలు గర్జన సభలు నిర్వహించినా అనుమతిస్తున్న, భద్రత ఏర్పాటుచేస్తున్న పోలీసులు.. పాదయాత్రకు ఎందుకు అనుమతించరనే ప్రశ్న ఎదురవుతోంది. కాపుల యాత్ర, సభ, కార్యక్రమాల్లో అల్లర్లు చెలరేగుతాయంటూ.. పదేపదే చెప్పడం ద్వారా ‘‘కాపులు అంటేనే అల్లర్లు చేసేవాళ్లు’’ అనే దురభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరొకవైపు కాపుల్ని బీసీల్లో చేర్చడం గురించి జరుగుతున్న ప్రక్రియ మొత్తానికి అడ్డుపడుతున్న.. దానిని వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య కార్యక్రమానికి మాత్రం అనుమతులు ఇవ్వడం వారికి మరింత మనస్తాపం కలిగిస్తోంది. అందుకే.. తమ కాపు కలం పట్ల ఒక నీతిని, ఇతర కులాల పట్ల మరో నీతిని ప్రదర్శిస్తూ.. ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, సమాజంలో చీలికలు తెస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.


Recent Random Post: