
కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా పట్టాభిషిక్తుడిని చేయడం అదిగో ఇదిగో అనుకోవడంతోనే సరిపోతోంది. తేదీలు నిర్ణయిస్తున్నారు. వాయిదా వేస్తున్నారు. అందుకు చెబుతున్న కారణాలు సమర్థనీయంగా లేవు. పట్టాభిషేకం చేద్దామనుకునేసరికి భయం కలిగించే ఏవో ఎన్నికలు ఎదురుగా వచ్చి నిలబడుతున్నాయి. దీంతో అపజయం సంభవించి రాహుల్‌కు ఎక్కడ అవమానం జరుగుతుందోనని వెనక్కిపోతున్నారు. కొన్నిసార్లు యువరాజే తరవాత చూద్దాంలే అని దాటేశారు.
ఈ నేపథ్యంలో ఆయన పట్టాభిషేకం మరోసారి వాయిదాపడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మరో మూడు రోజుల్లో అంటే అక్టోబరు 31న ఈ కార్యక్రమం జరగాల్సివుంది. ఈ తేదీ ప్రకటించేనాటికి అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఈలోగా గుజరాత్ ఎన్నికల షెడ్యూలు రావడంతో అధ్యక్ష బాధ్యతల స్వీకరణోత్సవం వాయిదా పడింది. అనుకున్న ప్రకారం బాధ్యతలు తీసుకున్నట్లయితే కొద్ది రోజులకే గుజరాత్ ఎన్నికలు జరుగుతాయి. అది ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వరాష్ట్రం. వారు పార్టీ గెలుపు కోసం సర్వస్వం ఒడ్డుతున్నారు. అందులోనూ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉంది.
ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే ‘రాహుల్‌ది ఐరన్‌లెగ్’ అనే నింద మోయాల్సివస్తుంది. అసలే రాహుల్ నాయకత్వ సామర్థ్యం మీద పార్టీలో అపనమ్మకముంది. దానికితోడు వెంటనే ఓటమి పాలైతే తీరని అవమానం మిగులుతుంది. బీజేపీ దాడి ఇంకా పెరుగుతుంది. బహుశా ఈ భయం కారణంగానే కావొచ్చు రాహుల్ పట్టాభిషేకాన్ని ఈ ఏడాది డిసెంబరు ఆఖరుకు వాయిదా వేశారు. అంటే గుజరాత్ ఎన్నికలు ముగిశాక ఈ కార్యక్రమం జరుగుతుంది.
అయితే కాంగ్రెసు నాయకులు గుజరాత్ ఎన్నికలను ప్రస్తావించకుండా సంస్థాగత ఎన్నికలు ఇంకా పూర్తికాలేదని, అన్ని పూర్తయ్యాక డిసెంబరులో అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సంస్థాగత ఎన్నికలు సహా అధ్యక్ష ఎన్నిక డిసెంబరు ఆఖరునాటికి ముగించాల్సివుంది. కాని ఇంతకుముందు సంస్థాగత ఎన్నికలు పూర్తికాకపోయినా అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్నారు.
నిజానికి కాంగ్రెసులో అధ్యక్ష ఎన్నిక నామ్‌కే వాస్తే అనేది తెలిసిన విషయమే. రాహుల్ కాకుండా మరొకరి పేరు ఎలా తలుస్తారు? రాహుల్‌కు పగ్గాలు ఇస్తే పార్టీకి లాభమా? నష్టమా? ఆయన సారథ్యం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? ఈ ప్రశ్నలకు ఇంకా సరైన జవాబు దొరకడంలేదు. రాజీవ్ గాంధీ పోయాక సోనియాను అద్యక్షురాలిని చేయడానికి ఇంత చర్చ జరగలేదనిపిస్తోంది.
ఒక దశలో పిల్లలను తీసుకొని తన సొంత దేశానికి వెళ్లిపోవాలని అనుకున్నారామె. భర్తనే రాజకీయాల్లోకి పోవద్దని అడ్డుకున్న సోనియాకు సహజంగానే రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. అందులోనూ విదేశీ మహిళ అయిన ఆమెకు ఈ దేశం, ఇక్కడి రాజకీయాల గురించి కనీస అవగాహన లేదు. అయినప్పటికీ పార్టీ నాయకుల ఒత్తిడిమేరకు పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె శక్తిమంతురాలైన నాయకురాలిగా ఎదగడం ఆశ్చర్యకరం.
రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న ఈ ఇటలీ మహిళ పదేళ్లపాటు తన సారథ్యంలో యూపిఎ ప్రభుత్వాన్ని నడిపించారు. కొమ్ములు తిరిగిన నాయకులను తన ఇంటి ముందు పడిగాపులు కాసేలా చేశారు. ఇంతటి బలమైన నాయకురాలి వారసుడు సహజంగానే బలంగా ఉండాలి. పార్టీ ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటుందనే భావన కలిగించాలి. కాని ఎందుకో రాహుల్ గాంధీ విఫల నాయకుడిగా ముద్ర వేయించుకున్నారు. కాని ఆయన తప్ప ఎవ్వరూ అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం లేదు. రాహుల్ అధ్యక్షుడైతే తమను పట్టించుకోడని సీనియర్లు భావిస్తున్నారు. ఇందిరాగాంధీ హయాం నుంచి పనిచేస్తున్న నాయకులున్నారు. వారికి, రాహుల్‌కు మధ్య తరాల అంతరం (జనరేషన్ గ్యాప్) ఉంది. దీంతో ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి.
రాహుల్ యువతతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. యంగ్ జనరేషన్‌తో తనకంటూ ప్రత్యేక బృందాన్ని తయారుచేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో సీనియర్లను పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. పాతతరం నాయకులు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాల్సిందిగా కోరుతున్నారు. కాని తన ఆరోగ్యం బాగాలేని ఆమె తిరస్కరిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగాలేని మాట వాస్తవమే. అయినప్పటికీ పనితీరును మీడియా విశ్లేషించినప్పుడు రాహుల్ కంటే సోనియాకే ఎక్కువ మార్కులు పడటం విశేషం.
Recent Random Post:

















