
‘రెండు టీషర్టులు కొంటే ఒకటి ఉచితం’…’రెండు చీరలు కొంటే ఒకటి ఫ్రీ’…ఇలాంటి ప్రకటనలు మనకు కొత్త కాదు. సరుకు అమ్ముకోవడానికి వ్యాపారులు అనుసరించే సూత్రం. ఇలాంటి ట్రెండే రాజకీయాల్లోనూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండే పెద్ద నాయకుడు అధికారపక్షంలో చేరాలనుకున్నప్పుడు సవాలక్ష షరతులు, డిమాండ్లు పెడతాడు. తనకు మంత్రి పదవి, తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు, భార్యకు ఇంకేదో పదవి..ఇలాగన్నమాట.
కొందరు పెద్ద నాయకులు రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్నప్పుడు భార్యకో, కుమారుడికో, కుమార్తెకో టిక్కెట్టు ఇవ్వాలని అడుగుతాడు. ఒక్కరికైతే ఫర్వాలేదు. మరి ఇద్దరికైతే? అది అత్యాశని చెప్పాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి కమ్ రెవిన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇలా అత్యాశ పడుతున్నారా? టీడీపీ అనుకూల టీవీ ఛానెల్ టాక్‌షోలో పాల్గొన్న కేఈ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు.
అయితే అధ్యాయం ఈయనతోనే అయిపోలేదు. తన రాజకీయ వారసత్వాన్ని ఇద్దరు కుమారులు కొనసాగిస్తారని చెప్పారు. ఇద్దరినీ బరిలోకి దించుతారట. ఈయన ఒక్కడు రాజకీయాల నుంచి విరమించుకుంటే డబుల్ ధమాకా మాదిరిగా ఇద్దరు వస్తారన్నమాట. రెండో కుమారుడు పత్తికొండ నుంచి పోటీ చేయడానికి అధినేత చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. మరి పెద్దబ్బాయి గురించి చెప్పలేదు.
అతన్ని ఎక్కడినుంచి బరిలోకి దించాలనేది ఇంకా నిర్ణయం కాలేదేమో. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వారసులకు చంద్రబాబు అనుమతి ఇస్తారా? అలా ఇస్తే ఒక ఆశావహుడికి అన్యాయం జరిగినట్లే. ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేయడం మన రాజకీయాల్లో కొత్త కాదు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు లేక ముగ్గురు పోటీ చేయడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంటుంది. ఆనం సోదరులు, కేఈ సోదరులు, జేసీ సోదరులు…ఇలా కొన్ని కుటుంబాలున్నాయి.
అలాగే భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, తండ్రీ కూతుళ్లున్నారు. గతంలో భూమా దంపతులు, నేదురుమల్లి దంపతులు ఉండేవారు. ఇలాంటి రాజకీయ కుటుంబాలు తెలంగాణలోనూ ఉన్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం ఇందుకు పెద్ద ఉదాహరణ. ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమందికి టిక్కెట్లు ఇచ్చినప్పుడు కొందరు ఆశావహుల రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. నిరాశ చెందుతారు.
కొందరు అలిగి ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతారు. కొందరు ఇతర పార్టీల్లోకి పోతారు. ఇదిలా ఉండగా కేఈ కృష్ణమూర్తి ముఖ్యమంత్రిపై అసంతృప్తిగా ఉన్నట్లు వినవస్తోంది. రెవన్యూ శాఖలో అవినీతి ఎక్కువైందని చంద్రబాబు పలుమార్లు పార్టీ, మంత్రివర్గ సమావేశాల్లో చెప్పడం కేఈ అసంతృప్తికి ఓ కారణం. మంత్రి అవినీతిని అరికట్టలేకపోతున్నారని బాబుకు అసంతృప్తిగా ఉంది.
ఇక చంద్రబాబు తాజాగా పది రోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పరిపాలన వ్యవహారాలు చూసేందుకు మొదటిసారిగా ఐదుగురు మంత్రులతో కమిటీ వేశారు. ఇందులో అత్యంత జూనియర్లయిన నారా లోకేష్, కాల్వ శ్రీనివాసులుతోపాటు మరో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకటరావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.
కాని సీనియర్ కమ్ ఉప ముఖ్యమంత్రి అయిన కేఈకి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇది ఈయనకు ఆగ్రహం కలిగించింది. ఒక డిప్యూటీ సీఎంను కమిటీలో వేసి, మరో డిప్యూటీ అయిన తనను పక్కన పెట్టడమేమిటని సన్నిహితుల వద్ద వాపోయారట. ముఖ్యమంత్రి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రులే బాధ్యతలు తీసుకుంటారు. కాని బాబు అందుకు భిన్నంగా మంత్రుల కమిటీ వేశారు. బహుశా ఈ కారణాలతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడంలేదేమో…!
Recent Random Post:

















