
కమల్ అంటే, కమల్‌హాసన్ కాదు.. కమల్ ఆర్ ఖాన్.! బాలీవుడ్ సినీ విశ్లేషకుడు. పేరుకే సినీ విశ్లేషకుడుగానీ, అన్ని విషయాల మీదా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటాడు. అది ఆయనిష్టం. భావ ప్రకటనా స్వేచ్ఛ దేశంలో వుంది కాబట్టి, ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు. ఈ విషయంలో కమల్ ఆర్ ఖాన్ని తప్పు పట్టలేం. కానీ, కొందర్ని పనిగట్టుకుని విమర్శించడం.. కాదు కాదు, తిట్టడం కమల్ ఆర్ ఖాన్ ప్రత్యేకత.
మన టాలీవుడ్ నటుడు రాణా విషయంలోనూ ఇలాగే నోరు పారేసుకున్నాడు కమల్ ఆర్ ఖాన్. కమల్ వ్యాఖ్యల్లో అత్యంత దారుణమైన దూషణలుంటాయి. నా దూషణలనుంచి ఎవరూ తప్పించుకోలేరన్నంతలా రెచ్చిపోతుంటాడు. తెలుగు సినిమాల్ని చీల్చి చెండాడేస్తుంటాడు. బాలీవుడ్ సినిమాల్నీ వదిలి పెట్టడు. విమర్శించడం, రివ్యూలు నెగెటివ్‌గా రాయడం అనేది చిన్న విషయమే కావొచ్చు. కానీ, అత్యంత దారుణంగా తిట్టేస్తుంటాడు. అదే కమల్ని ‘సెలబ్రిటీగా’ మార్చేసిందనుకోవచ్చేమో.!
ఓవరాక్షన్ ఎప్పుడో ఒకప్పుడు తాట తీయించేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసినందుకు అమీర్‌ఖాన్ అభిమానులకి మండిపోయింది. ట్విట్టర్‌కి ఫిర్యాదు చేశారట అమీర్‌ఖాన్ అభిమానులు. అంతే, కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ‘మూసివేయబడింది’.! ‘అమీర్‌ఖాన్, ట్విట్టర్‌కి యజమాని కాబట్టి ఏమీ చేయలేం..’ అంటూ నిట్టూర్చాడు కమల్ ఆర్ ఖాన్. ఇది మళ్ళీ ఓ సెటైర్ అనుకోవాలి.
అయితే, కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ ఖాతా ‘మూత’కి కారణాలు చాలానే వున్నాయనే వాదనలూ లేకపోలేదు. చాలాకాలంగా కమల్ మీద ఫిర్యాదులు వస్తున్నాయనీ, ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే ట్విట్టర్ అక్కౌంట్ ‘క్లోజ్’ అయ్యిందనీ తెలుస్తోంది.
Recent Random Post:

















