కాంగ్రెస్ కండువాతో సభకు రానున్న రేవంత్!

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే పర్వం పూర్తయిపోయింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాకపోతే ఇంకా ఎమ్మెల్యే పదవిలో కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో పాటూ ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన చేసిన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. స్పీకరు మధుసూదనాచారి ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

స్పీకరు ఆ రాజీనామా లేఖను ఆమోదించే వరకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కిందేలెక్క! ఆ ప్రకారం ఆయన సభకు కూడా రావచ్చు. ఆయన వెళ్లి కాంగ్రెస్ సభ్యుల వరుసల్లో కూర్చున్నా ఆయనను తప్పు పట్టేవాళ్లు ఎవరూ ఉండరు. ఈ సమీకరణాల ప్రకారం చూస్తే.. ఈ శాసనసభ సమావేశాల్లోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాతో శాసనసభకు వస్తారని అనిపిస్తోంది.

ఎమ్మెల్యే గిరీకి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉపఎన్నిక తర్వాత గానీ సభకు రావొద్దని అనుకుని ఉండవచ్చు. కానీ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు గనుక.. ఆయన సభకు రావడానికి అవకాశం ఉంది. అసలే రేవంత్- కేసీఆర్ సర్కారు మీద సూటి విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు. ఇన్నాళ్లూ ఆయన తన వెంట కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే (ఆర్.కృష్ణయ్య ఎటూ వెంట ఉండరు గనుక)తో సభలో తన వంతు పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆయనకు కాస్త మంది బలం ఉన్న పార్టీ నేతగా.. మరింత దూకుడుగా ప్రభుత్వం మీద దాడికి దిగే అవకాశం ఉంటుంది.

కాకపోతే.. రేవంత్ ను ఎదుర్కొనే విషయంలో తెరాస కూడా దూకుడుగానే ఉంటుందని అనుకోవాలి. గతంలోనూ పలుమార్లు ఆయన మీద సస్పెన్షన్ వేటు పడిన తరహాలోనే.. కాంగ్రెస్ కండువా పడిన తర్వాత కూడా.. ఆయన దూకుడుకు విరుగుడుగా తెరాస పదేపదే సస్పెన్షన్ దండాన్ని ప్రయోగించినా ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు.

కాకపోతే సభలో తెలుగుదేశం పార్టీ పరిస్థితే మరీ ఘోరంగా తయారవుతుంది. ఆ పార్టీకి ఇక మిగిలింది ఇద్దరే ఎమ్మెల్యేలు. వారిలో ఆర్.కృష్ణయ్య తనను తెలుగుదేశం నాయకుడిగా గుర్తించడాన్నే అంగీకరించరు. ఇకపోతే – ఒకేఒక్క ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఆయనకు పదవికట్టబెట్టినా.. లేకున్నా.. ఆయననే తెదేపా ఫ్లోర్ లీడర్ గా భావించాలి. ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించడంలో రేవంత్ స్థాయి దూకుడు ఏమాత్రం లేని సండ్ర.. ఒంటరిగా ఏం చేయగలరు? అనేది కూడా ప్రశ్నార్థకమే.


Recent Random Post: