కొత్త పార్టీ ప్రారంభించిన ఉపేంద్ర

తను రాజకీయాల్లోకి రాబోతున్నానని ఇప్పటికే ప్రకటించిన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర.. ఈరోజు తన పార్టీని గ్రాండ్ గా ప్రారంభించాడు. బెంగళూరులోని గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన భారీ కార్యక్రమంలో తన కొత్త పార్టీ రూపురేఖలు, ఎజెండాను వివరించాడు. తన పార్టీ పేరును “కర్ణాటక ప్రజావంత జనతాపక్ష” గా ప్రకటించాడు ఉపేంద్ర.

నిజానికి మహేష్ గౌడ అనే వ్యక్తి ఈ పేరు రిజిస్టర్ చేశాడు. దాన్ని ఉపేంద్రకు ఇచ్చేశాడు. పార్టీ ప్రకటన సందర్భంగా పార్టీకి సంబంధించి యాప్ లాంచ్ చేసిన ఉపేంద్ర.. నవంబర్ 10న పార్టీ వెబ్ సైట్ ప్రారంభిస్తానని ప్రకటించాడు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఎవరైనా తన పార్టీలో ఉచిత సభ్యత్వం తీసుకోవచ్చని ప్రకటించాడు. తన ఆఫీస్ ను కేవలం పార్టీ కార్యాలయంలా కాకుండా.. నలుగురు కలిసి ఆలోచనలు పంచుకునే స్మార్ట్ ఆఫీస్ గా మార్చేస్తానంటున్నాడు.

ఆటోరిక్షా లేదా చెప్పు గుర్తును తన పార్టీ గుర్తుగా ఉపేంద్ర ఎంచుకునే అవకాశం ఉంది. ఉపేంద్రకు తెలిసినవాళ్లు మాత్రం ఆటోరిక్షాకే ఓటేశారు. పార్టీ ప్రకటన సందర్భంగా ప్రసంగం చేసిన ఉపేంద్ర, ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశాడు. మోడీ ఆచరణలోకి తీసుకొచ్చిన ‘స్మార్ట్ సిటీస్’ కార్యక్రమాన్ని కాస్త మార్చి తను ‘స్మార్ట్ విలేజ్’ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఉపేంద్ర ప్రకటించాడు.

అయితే పార్టీ పెట్టిన సందర్భంగా ఉపేంద్ర ప్రకటించిన పేరు చాలా పెద్దగా ఉంది. దాన్ని షార్ట్ కట్ లో ‘ప్రజాకీయ’ అనే పేరుతో చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు. వ్యవహారికంగా అదే పేరును ఉపేంద్ర కొనసాగిస్తాడా లేక కొత్త పార్టీ పేరుకు షార్ట్ కట్ కనిబెడతాడా అనేది చూడాలి.


Recent Random Post: