
సాధారణంగా కొందరు నాయకులు చిట్టచివరి నిమిషంలో.. నామినేషన్లు వేసే గడువు సమయం మరికొద్ది గంటల్లో ముగిసిపోతుందనగా.. అప్పుడు అభ్యర్థులను ఖరారు చేస్తుంటారు. మరీ కొందరైతే.. చివరి క్షణాల్లో బీఫారం లను హెలికాప్టర్ లో నియోజకవర్గాలకు పంపిన సందర్భాలు కూడా మనకు తెలుసు. అంటే పార్టీకి అధినేతలుగా ఉన్న వారికి అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాము లాంటిది.
చాలా చోట్ల ఫైనల్ గో పోరు బరిలోకి దించాల్సింది ఎవరినో అనే విషయంలో చివరిదాకా వారు ఒక నిర్ణయానికి రాలేకపోతారు. దీనివలన తుదినిమిషంలో ఖరారయ్యే అభ్యర్థులు నియోజకవర్గంలో ప్రచారానికి, ప్రజల ఆదరణ పొందడానికి సరైన వ్యవధిలేక బోల్తా కొట్టే ప్రమాదాలు కూడా తలెత్తుతుంటాయి.
అయితే గులాబీ బాస్ కేసీఆర్ కు మాత్రం 2019 ఎన్నికలకు సంబంధించి.. ఇలాంటి టెన్షన్ ఏమీ ఉన్నట్లు లేదు. ఈ సారి ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అభ్యర్థలు జాబితాను విడుదల చేస్తా అని ఆయన ఇంకా ఎన్నికలకు ఏడాదికి పైగా మిగిలి ఉండగానే.. చాలా ధాటిగా ప్రకటించారు. 99 శాతం సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కుతాయంటూ మరో క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే మిగిలిన స్థానాల్లో మాత్రమే కొత్తగా అభ్యర్థులు ఎంపికకు సంబంధించిన కసరత్తు ఆయనకు అవసరం ఉంటుందన్నమాట.
ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో తెరాసకు 82 మంది సభ్యుల బలం ఉంది. అంటే దాదాపుగా వీరందరికీ మళ్లీ టికెట్లు ఖరారని అనుకోవాలి. ఇకపోతే 37 సీట్లలో కొత్త అభ్యర్థులు వస్తారు. 7 ఎంఐఎం సంగతి వదిలేస్తే.. మహా అయితే 30 సీట్లకు సిగపట్లు ఉంటాయి. గతంలో ఓడిన వారికి ఇస్తారా కొత్త వారిని బరిలోకి దింపుతారా కసరత్తు జరగాల్సి ఉంటుంది. ఆ మిగిలిన సీట్ల మీద విపక్షాలు కూడా బాగా దృష్టి పెడతాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించడం.. మామూలు సంగతి కాదు.
అలా జరిగితే అప్పటికప్పుడు ఆ పార్టీనుంచి అసంతృప్తులు ఫిరాయించవచ్చు.. లేదా, తెరాస అభ్యర్థులను బట్టి ప్రతిపక్షం ఇంకా గట్టి అభ్యర్థులను మోహరించేలా వ్యూహాలు మార్చుకోవచ్చు. ఇలా రకరకాల ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అయితే ఇవేమీ ఖాతరు చేయకుండా కేసీఆర్ మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పడం.. విజయం మీద ఆయనకున్న ధీమాకు నిరూపణగా ఉంది. విజయంమీద అంతగా నమ్మకం ఉంటే మరో నేత ఎవరైనా ఇలా చెప్పగలరా? అనే మాట కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Recent Random Post:

















