జగన్ పాదయాత్ర : చంద్రబాబు సన్నాహాలు!

ఇదేమిటి.. వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేయడానికి పూనుకుంటూ ఉంటే.. చంద్రబాబునాయుడు సన్నాహాలు చేయడం ఏమిటి? అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడిన వేర్వేరు సంగతులు.

జగన్ పాదయాత్ర చేయడానికి ఉద్యుక్తుడు అవుతున్న వేళ.. జగన్ ఏయే అంశాల గురించి అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి, పనితీరుగురించి ప్రజల ఎదుట విరుచుకు పడే ప్రమాదం ఉన్నదో.. ఆయా అంశాల్లో ముందు జాగ్రత్తగా కొంత పురోగతి చూపించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాయా కసరత్తులు ప్రారంభించింది. జగన్ తమను విమర్శించడానికి అవకాశం లేకుండా, విమర్శించినా సరే.. ఆ విమర్శలన్నీ అబద్ధాలే అని తాము కౌంటర్ లు ఇవ్వడానికి వీలుగా.. ఇప్పుడు సన్నాహాలు చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ఎందరు భృతికి అర్హులైన నిరుద్యోగులు ఉన్నారో లెక్క తేల్చాలని అధికారుల్ని పురమాయిస్తున్నారు. ప్రాథమికంగా 33 లక్షల మంది ఉన్నట్లుగా లెక్కలు చెబుతుండగా, మంత్రి లోకేష్, ఆర్థిక నిపుణుడు కుటుంబరావులు కలిసి ఖచ్చితమైన సంఖ్యను తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్క తేలిన వెంటనే వారందరికీ నిరుద్యోగ భృతి పంపిణీ కూడా జరుగుతుందని అంటున్నారు.

జగన్మోహన రెడ్డి ఇటీవల అనంతపురంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో కూడా ఈ నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రస్తావించారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అన్నింటా మాట తప్పుతున్నారని అంటూనే.. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. అందుకే ఆ విషయంలో చంద్రబాబు సర్కార్ అలర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది.

జగన్ పాదయాత్ర ప్రారంభం అయితే ఈ అంశం మరింతగా రేగుతుందని, అప్పుడు యువతలో వెల్లువెత్తే వ్యతిరేకతను తట్టుకోవడం కష్టం అని.. జగన్ యాత్రకు వెళ్లేలోగానే భృతి విషయంలో తాము ఏదో ఒకటి చేసేస్తున్నట్లుగా కలర్ ఇవ్వడం అవసరం అని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే హడావిడిగా లెక్కల పేరిట నిరుద్యోగుల గణాంకాలు ప్రకటించి.. త్వరలో పంపిణీలు ఉంటాయనే సంకేతాలు ఇస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.

అయితే యాత్రలోగా ప్రభుత్వ హామీలు ఇవ్వగలదే తప్ప.. నిరుద్యోగుల లెక్కలు తేల్చడమే డిసెంబరు నాటికి అవుతుందని అనుకుంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఈ అంశం మీద ఇంత వేగంగా స్పందిస్తున్నదంటే.. అది జగన్ సాధించిన విజయమేనా? అని పలువురు భావిస్తున్నారు.


Recent Random Post: