
లక్ష కోట్ల అక్రమార్జన.. అంటూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ జగన్ మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఆ లక్ష కోట్లని, ఆ తర్వాత 16కోట్లుగా టీడీపీ మేధావి వర్గం ‘పెంచి చూపించేందుకు’ ప్రయత్నించి భంగపడిందనుకోండి.. అది వేరే విషయం. జగన్ మీద నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ అలా అలా కొన’సాగు’తోంది.! అసలంటూ వైఎస్ జగన్, కాంగ్రెస్ పార్టీని వీడకపోయి వుంటే ఆయన మీద అక్రమాస్తుల కేసు అనేదే వుండేది కాదు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.
ఇక, తన మీద టీడీపీ చేసే ఆరోపణల్ని ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ తిప్పికొడుతూనే వున్నారు. పలుమార్లు అసెంబ్లీలోనే, తన మీద టీడీపీ ఎదురుదాడికి దిగినప్పుడు, ‘నాకు అన్ని ఆస్తులు వున్నాయని నిరూపించగలిగితే, వాటిని మీకే రాసిచ్చేస్తా..’ అని చాలా సందర్భాల్లో వైఎస్ జగన్ సవాల్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ విసిరిన సవాల్‌కే ఏనాడూ ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, టీడీపీకి చెందిన ముఖ్య నేతలుగానీ స్పందించిన దాఖలాల్లేవు.
అలాంటిది, పాదయాత్రలో వైఎస్ జగన్, ‘నాకు విదేశాల్లో ఆస్తులున్నాయని ఆరోపిస్తున్న చంద్రబాబు అండ్ టీమ్‌కి సవాల్ విసురుతున్నా, అవి వున్నాయని నిరూపించండి.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నిరూపించలేకపోతే నాకు క్షమాపణ చెబుతారా.? ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా.?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషమే మరి.!
టీడీపీ అధికారంలో వుంది.. జగన్‌ని ఇరకాటంలో పెట్టాలంటే ఇదొక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. కానీ, అక్కడ మేటర్ వుండాలి కదా.! ప్యారడైజ్ పేపర్స్ పేరుతో, కొన్ని కథనాలు రావడంతో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే మీడియా కథనాల్ని వండి వడ్డించేసింది. అవి పట్టుకుని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా పలువురు టీడీపీ నేతలు జగన్‌పై విమర్శలతో విరుచుకుపడిపోయారు. రాజకీయాల్లో ఈ తరహా చవకబారు విమర్శలు మామూలే. కానీ, మరీ ఇంత దిగజారుడు విమర్శలా.? అన్నదే వైఎస్సార్సీపీ ప్రశ్న.
వైఎస్ జగన్ సవాల్ విసిరేశారు, రాజకీయాల నుంచి తప్పుకుంటానని. మరి, ఆ సవాల్‌ని స్వీకరించే దమ్ము టీడీపీకి వుందా.? వేచి చూడాల్సిందే.
Recent Random Post: