
ఏ పార్టీలోనైనా నాయకుల పదవుల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కొంతమందిని పీకేస్తారు. కొందరికి కొత్తగా బాధ్యతలు అప్పగిస్తారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు, సమీకరణాలకు అనుగుణంగా నాయకత్వం ఈ మార్పులు చేర్పులు చేస్తుంటుంది. అయితే ఇలాంటి చర్యలు కాంగ్రెసు పార్టీలో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంటాయి. ‘ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే’ అనేటట్లుగా ఢిల్లీలోని అధిష్టానం పావులు కదుపుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలొస్తున్నాయంటే చాలు మార్పులు చేర్పులు తప్పనిసరిగా ఉంటాయి.
నాయకులను అటూ ఇటూ చేయడంవల్ల అనుకూల ఫలితాలు రావొచ్చు రాకపోవచ్చు. అది వేరే విషయం. తెలంగాణ కాంగ్రెసు నాయకత్వంలో త్వరలోనే మార్పులుంటాయని ఓ సమాచారం. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు జానా రెడ్డి ఆ పదవుల్లో ఉండరని కాంగ్రెసు వర్గాల ద్వారానే తెలుస్తున్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ సమాచారం.
రాహుల్ గాంధీ అధ్యక్షుడయ్యాక తెలంగాణ కాంగ్రెసు ప్రక్షాళన జరుగుతుందని అనుకుంటున్నారు. యువరాజు మొదట దృష్టి పెట్టేది తెలంగాణ మీదనే. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ఆయన పర్యటించే మొదటి రాష్ట్రం తెలంగాణేనని ఇదివరకే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చేస్తారనే సమాచారం వచ్చింది. 2019 ఎన్నికలు ఉత్తమ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క సారథ్యంలోనే జరుగుతాయని గతంలో రాష్ట్ర ఇన్చార్జి కుంతియా చెప్పారు. కాని అందుకు భిన్నంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.
ఉత్తమ్ మీద ఫిర్యాదులు నేరుగా సోనియా గాంధీకి వెళ్లాయని, దాని ప్రభావమే మార్పు అని అంటున్నారు. కొంతకాలం కిందట తెలంగాణ కాంగ్రెసులో బాహుబలి ఎవరు? అనే చర్చ జోరుగా సాగింది. ఎన్నికల్లో టీ-కాంగ్రెసును ముందుకు నడిపించే, గెలిపించే బాహుబలి ఎవరు? అని అర్థమన్న మాట. టీఆర్ఎస్పై కాంగ్రెసు ఏమాత్రం పోరాడలేని స్థితిలో ఉంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి జరిగిన పలు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్ నాయకత్వంలోని కమిటీయే వచ్చే ఎన్నికల్లోనూ పనిచేస్తే పార్టీ చిత్తుగా ఓడిపోతుందనే అభిప్రాయముంది. కాంగ్రెసు పార్టీలో బలమైన నాయకుడు అనుకున్న సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెసు కంటే టీఆర్ఎస్కు ఎక్కువ ఉపయోగపడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన తమకు పెద్ద తలనొప్పిగా మారారని కాంగ్రెసు నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెసు తరపున అసెంబ్లీలో నాయకుడైన జానా రెడ్డి ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కోలేకపోతున్నారు. కాంగ్రెసును రక్షించడానికి బాహుబలి వస్తాడనే చర్చ రోజుల తరబడి కాంగ్రెసులో, రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. బాహుబలి రావడమంటే ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఉద్వాసన చెప్పడమే. దీంతో బాహుబలులు ఉత్తమ్, భట్టియేనని కుంతియా చెప్పారు.
తాజా సమాచారం ప్రకారం… ఉత్తమ్‌కుమార్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వవచ్చని, జానా రెడ్డిని వర్కింగ్ కమిటీలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని తీసేస్తే ఈ పదవి కోసం కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ ఎస్సీలు కావడం గమనార్హం. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లు భట్టివిక్రమార్కను జానారెడ్డి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నియమించాలనుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్లు వినిపిస్తున్నాయి.
గతంలో అధ్యక్ష పదవి కోసం మాజీ క్రికెటర్ అజర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనకు వచ్చాయి. విచిత్రమేమిటంటే… ఈ జాబితాలో మాజీ హీరోయిన్, గత ఎన్నికల్లో ఓడిపోయిన విజయశాంతి పేరు కూడా ఉండటం. ఏదిఏమైనా తెలంగాణ కాంగ్రెసులో మార్పులు జరిగితే విజయానికి ఎంతవరకు దోహదం చేస్తుందో…!
Recent Random Post:

















