
మీ బ్యాంకులోంచి 2 వేల రూపాయలు తీసుకోవడం కోసం, రెండు మూడొందలు ఖర్చు చేయాల్సిన దుస్థితి మీకెప్పుడన్నా కలిగిందా.? ఇంత ఖర్చు చేసినా, 2 వేల రూపాయలు దక్కించుకోలేకపోగా, చేతిలోని మూడొందలు ఖర్చయిపోయిన అనుభవం మీకెదురైందా.? ‘తొక్కలో 2 వేలు.. ఈ గంట సమయం వెచ్చిస్తే, ఆ టైమ్‌లోనే ఐదారు వేలు సంపాదించేవాళ్ళం’ అని మీకు అన్పించిందా.? ఇలాంటి ప్రశ్నలకు గత ఏడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31లోపు చాలామంది చెప్పిన సమాధానం ‘ఔను’ అనే.!
సామాన్యుడి పాట్లు ఇవి. డబ్బున్నోడికి మాత్రం ఎలాంటి సమస్యల్లేవు. ఎవర్నయితే టార్గెట్ చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారో, వాళ్ళంతా ఎంచక్కా తమ ఇళ్ళకే నోట్ల కట్టల్ని తెప్పించుకున్నారు. సామాన్యుడి బతుకే కుక్కలు చింపిన విస్తరలా తయారైంది. ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం, బ్యాంకుల్లో తమ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకు సిబ్బంది కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది సామాన్యుడికి. ఆకరికి, చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకీ డబ్బుల్లేని దుస్థితి. సామాన్యుడింట పెళ్ళి ఎంత భారమైపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రోమ్ తగలబడిపోతోంటే, నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట.! దేశమిలా తగలబడిపోతోంటే, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఇంకా తప్పులు చేస్తూనే వచ్చింది కేంద్రం. ‘ప్రచారం’ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 వేల కోట్ల రూపాయల్ని తగలేశాయన్నది ఓ అంచనా. క్యాష్ లేదు కదా, అందుకే డిజిటల్ వ్యవహారం తెరపైకొచ్చింది. విదేశాల నుంచి పెద్దయెత్తున పీఓఎస్ మెషీన్ల దిగుమతి. మేకిన్ ఇండియా అటకెక్కి, ఆ యంత్రాల దిగుమతి మీద ఫోకస్ ఎక్కువైంది.
పాత 500, 1000 రూపాయల నోట్ల రద్దు చేశాక, వాటి స్థానంలో 2 వేల రూపాయల నోట్లను, కొత్త 500 రూపాయల నోట్లను ముద్రించేందుకు అటూ ఇటూగా 8 వేల కోట్ల రూపాయలదాకా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే, నోట్ల రద్దు వెతలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రం పబ్లిసిటీ కోసం కావొచ్చు, ఇంకోదాని కోసం కావొచ్చు.. అనవసరంగా చేసిన ఖర్చులో ప్రతి రూపాయీ, సామాన్యుడి జేబులోనిదే. అంటే, సొమ్ము ఒకడిది.. సోకు ఇంకొకడిదన్నమాట.
16 వేల కోట్ల రూపాయల లాభం ఆర్బీఐకి కలిగితే, అందులో పైన చెప్పుకున్న నష్టాలన్నిటినీ మైనస్ చేస్తే.. చివరికి మిగిలేది నష్టమే తప్ప లాభం కానే కాదు. అటు రిజర్వు బ్యాంకునీ ముంచేసి, ఇటు సామాన్యుల్నీ ముంచేసి.. మోడీ సాధించిందేమిటి.? సోకాల్డ్ కుబేరుల ఆస్తులు మాత్రం గడచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. రైతుల ఆత్మహత్యలు, సామాన్యుడి వెతలు.. మామూలే.
దేశాన్ని ఇంతలా భ్రష్టుపట్టించేసిన ప్రధాని దేశ చరిత్రలోనే ఇప్పటిదాకా మోడీ తప్ప ఇంకెవరూ లేరనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? భళా మోడీ.. భళా.. ఏదైనా రికార్డే.. చెత్త పనికీ రికార్డుల్లోకి ఎక్కించాల్సిందే. ‘ఇప్పటికైనా బాగుపడతామేమో..’ అన్న చిన్న ఆశ, ఇంతటి తీవ్ర నిర్ణయాన్నీ దేశ ప్రజలు సమర్థించేలా చేసింది. కానీ, షరామామూలుగానే ఇక్కడ దేశ ప్రజానీకం ఓడిపోయారు.. పాలకులే గెలిచారు.
Recent Random Post: