
ఇటీవలి కాలంలో ఏ సినిమాకీ లేనంతగా ‘పద్మావతి’ సినిమాపై వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. చరిత్రను వక్రీకరించి ‘పద్మావతి’ సినిమాని తెరకెక్కించారన్నది రాజ్పుత్ కర్ణి సేన ఆరోపణ. ఈ వివాదంలో పలువురు రాజకీయ నాయకులు కూడా ఆజ్యం పోసేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో వున్నవారు సైతం ‘పద్మావతి’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, వివాదం కనీ వినీ ఎరుగని రీతిలో రాజుకుని, భగ్గున మండుతోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని డిసెంబర్ 1న విడుదల చేస్తామని ‘పద్మావతి’ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ చెబుతున్నారు. అయితే, సినిమాలో ఎలాంటి వివాదాస్పద అంశాలూ లేవనీ, చరిత్రను చరిత్రలాగానే తెరకెక్కిస్తున్నామని ఆయన క్లారిటీ ఇవ్వక తప్పడంలేదు. ఎంత స్పష్టత ‘పద్మావతి’ సినిమా టీమ్ నుంచి వస్తున్నా, ‘విడుదలకు ముందు మాకు సినిమా చూపించాల్సిందే’ అన్న మాటని మాత్రం వెనక్కి తీసుకోవడంలేదు కర్ణిసేన.
ఈ నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీ పోలీసులను ఆశ్రయించారు. సినిమా విడుదల నేపథ్యంలో ‘ప్రొటెక్షన్’ కోరారాయన. కానీ, భద్రత ఎవరికి ఇవ్వాలి.? నటీనటులు, సాంకేతిక నిపుణులకు మాత్రమేనా.? థియేటర్లకు కూడా ఇవ్వాలా.? ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజమే మరి, ఒకటా.? రెండా.? వంద కాదు.. రెండొందలు కాదు.. వెయ్యి కన్నా ఎక్కువ.. ఆ మాటకొస్తే రికార్డు స్థాయిలో థియేటర్లలో ‘పద్మావతి’ విడుదల కావాల్సి వుంది.
సో.. మొత్తంగా అన్ని థియేటర్లకూ భద్రత ఇవ్వాలన్నమాట. అది సాధ్యమేనా.? అంటే, అసాధ్యమైతే కాదుగానీ.. చాలా కష్టమన్నది నిర్వివాదాంశం. ప్రధానంగా రాజస్థాన్ సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతను థియేటర్లకు కల్పిస్తే సరిపోతుందనీ, దక్షిణాదినా సెన్సిటివ్ ఏరియాస్లో భద్రత అవసరం వుంటుందని సంజయ్ లీలా భన్సాలీ అభిప్రాయపడ్తున్నారు. మరోపక్క, డిసెంబర్ 1వ తేదీని ‘బంద్’గా ప్రకటించింది కర్ణిసేన. ‘సినిమా విడుదలైతే థియేటర్లను తగలబెడ్తాం.. ఆ తర్వాత మీ ఇష్టం’ అని ఇప్పటికే కర్ణిసేన, థియేటర్ల యాజమాన్యాల్ని హెచ్చరించిన విషయం విదితమే.
Recent Random Post: