బర్త్‌ డే బ్యూటీ డబుల్‌ ధమాకా

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్‌, ఆ తర్వాత ‘నేను లోకల్‌’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే. సౌందర్య తర్వాత ఆ స్థాయి నటి.. అన్న గుర్తింపుని తొలి రెండు సినిమాలతోనే దక్కించుకుంది కీర్తి సురేష్‌. ఆమె సింప్లిసిటీ కావొచ్చు.. అందాల విందుకు ‘నో’ చెప్పిన తీరు కావొచ్చు.. కారణం ఏదైతేనేం, తొలి రెండు సినిమాలతోనే చాలా మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

అందుకేనేమో, ఏకంగా మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మహానటి’ సినిమాలో సావిత్రిగా కన్పించే ఛాన్స్‌ కొట్టేసింది కీర్తి సురేష్‌. అంతేనా, పవన్‌కళ్యాణ్‌ సరసన ఓ సినిమాలో నటించేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు తమిళంలోనూ బిజీగా వున్న కీర్తి సురేష్‌ పుట్టినరోజు నేడు.

ఓ వైపు పవన్‌కళ్యాణ్‌ కొత్త సినిమాలో కీర్తి సురేష్‌ లుక్‌ని విడుదల చేయడం.. ఇంకోపక్క ‘మహానటి’ సినిమాలో ఆమె లుక్‌ని విడుదల చేయడం.. వెరసి, కీర్తి సురేష్‌ పుట్టినరోజు కానుకగా డబుల్‌ ధమాకా అనుకోవాలేమో. ‘వన్‌ అండ్‌ ఓన్లీ మహానటి..’ అంటూ కీర్తి సురేష్‌ గురించి ‘మహానటి’ టీమ్‌ అభినందించడం గమనార్హమిక్కడ.


Recent Random Post: