
పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట మారుస్తూ రాష్ట్రాన్ని మోసం చేస్తోందనే మాట చాలా మంది నుంచి వినిపిస్తూ ఉంది. గత కొన్ని నెలలుగా… కేంద్రం ధోరణి పోలవరం పట్ల చాలా భిన్నంగా కనిపిస్తోందని, నష్టం జరుగుతున్నదని పలువురు అంచనా వేస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
ప్రాజెక్టు పనులు సాగే విషయంలో తాను చెప్పిన మార్పు చేర్పుల్లో ఏ ఒక్కదానికీ కేంద్రం నుంచి అనుమతి సాధించుకోలేకపోయినా చంద్రబాబు.. ఇవాళ వారు.. నిధుల విడుదల విషయంలోనూ కొత్త డ్రామాలు ఆడుతున్నప్పటికీ.. తాను ఏమీ ప్రశ్నించకుండా నిశ్శబ్దం పాటిస్తున్నారు. అదేమంటే మిత్రధర్మం అంటారు. మిత్రధర్మం కోసం రాష్ట్రం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకుంటారా? అనేది సందేహం. కనీసం కేంద్రం నాటకాలాడితే.. కోర్టుకు వెళ్లి హక్కులు సాధించుకోవచ్చు కదా.. అనే మీమాంసకు ఆయన వద్ద సమాధానం లేదు.
అయితే చంద్రబాబునాయుడు మిన్నకున్నప్పటికీ.. దేశం గొడ్డుపోలేదు అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నిరూపించారు. ఆయన ఈ విషయంలో కోర్టులో పిల్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే పూర్తి వ్యయాన్ని మార్పు చేర్పులు లేకుండా కేంద్రం మాత్రమే భరించేలా చట్టం ప్రకారం వ్యవహరించేలా.. కేంద్రాన్ని ఆదేశించాలని.. చంద్రబాబు చెబుతున్న మాటలు రాష్ట్ర ఖజానాపై భారం పెంచేలా తయారవుతున్నాయని కేవీపీ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక.. దానికి కాగల పూర్తి ఖర్చును కేంద్రం మాత్రమే ఏ రకంగా భరించాల్సిన అవసరం ఉన్నదో కేవీపీ తన పిటిషన్ లో కారణాలన్నీ సోదాహరణంగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి పిటిషన్ పట్ల చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది చాలా కీలకమైన సంగతిగా ఉంది.
ఎందుకంటే.. ఇలాంటి వ్యవహారాల్లో.. తన చేతగానితనం బయటపడే సమయంలో.. ఎదురుదాడికి దిగడం చంద్రబాబుకు అలవాటు. విపక్షాలకు చెందిన వారు కోర్టు కేసుల ద్వారా పనులు జరగకుండా అడ్డుపడుతున్నారు. వారంతా ప్రగతి నిరోధకులు వంటి కామెంట్లు విసరడం ఆయనకు అలవాటు. నిజానికి పోలవరం మీద కేవీపీ వేసిన పిల్ వల్ల అయితే గియితే రాష్ట్రానికి మంచి జరుగుతుందే తప్ప.. కీడు జరిగే అవకాశం ఎంతమాత్రమూ లేదు.
చంద్రబాబు ఈ పిల్ ను సమర్థించడం కలలో మాట.. కనీసం ఈ విషయంలో మిన్నకుంటారా.. రాష్ట ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉన్నది గనుక.. వీరి వాదనలు వినిపించాల్సిన సందర్భాల్లో కేంద్రం బాధ్యత గురించి స్పష్టంగా వివరిస్తారా అనేది వేచిచూడాలి.
Recent Random Post: