
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినిమాల్లో బీభత్సమైన డైలాగులు చెప్పడంలో దిట్ట. ఆయనిప్పుడు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, ఎమ్మెల్యే కూడా. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సినీ నటుడు, ఎమ్మెల్యే.. వీటితోపాటు ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోనూ బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ని ఏర్పాటు చేస్తామని గతంలో బాలకృష్ణ ప్రకటించిన విషయం విదితమే. వీలు చిక్కినప్పుడల్లా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబోయే క్యాన్సర్ ఆసుపత్రి గురించి మాట్లాడేవారు. ఏమయ్యిందో, ఈ మధ్యకాలంలో బాలయ్య నోట ఆ ఆసుపత్రి గురించిన సమాచారం ఏదీ బయటకు రావడంలేదు. ఎందుకిలా.? ఏమో మరి, బాలయ్యకే తెలియాలి.
తన సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుండడం, ఇంకోపక్క ‘లైఫ్ ఎగైన్ సంస్థ విశాఖలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించడం ఆ కార్యక్రమంలో బాలకృష్ణ కూడా పాల్గొనడం.. ఈ సందర్భంలోనే బాలయ్య క్యాన్సర్ ఆసుపత్రి హామీ ఏమయ్యింది.? అన్న చర్చ షురూ అయ్యింది. బావ చంద్రబాబు అనుమతి లేకుండా బాలయ్య ముందడుగు వేసే ప్రసక్తే లేదు. ఆ కారణంగానే కాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు పనులు ఆగాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఆరోగ్యశ్రీకి సంబంధించి హైద్రాబాద్‌లో చికిత్స పొందే వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఒక్క క్యాన్సర్ చికిత్సకి మాత్రం వెసులుబాటు కొనసాగిస్తోందనుకోండి.. అది వేరే విషయం. గడచిన మూడున్నరేళ్ళలో ఇటు చంద్రబాబు, అటు బాలకృష్ణ చిత్తశుద్ధి ప్రదర్శించి వుంటే ఈపాటికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటై, రోగులకు అందుబాటులోకి వచ్చేదే. స్వర్గీయ ఎన్టీఆర్ హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆసుపత్రి ఎంతోమంది రోగులకు సేవలందిస్తోంటే, ఆ పేరు చెప్పి ఆయన తనయుడు పబ్లిసిటీ స్టంట్లు చేయడం మినహా, ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చిన మాటనీ నిలబెట్టుకోలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Recent Random Post:

















