మోడీ ఆత్మగౌరవ నినాదం ఫలిస్తుందా

ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. డిసెంబర్‌ 9, 14ల మధ్య ఎన్నికలు జరుగనున్నాయి. కేవలం హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలనే ప్రకటించి దానితో పాటు ప్రకటించాల్సిన గుజరాత్‌ ఎన్నికల షెడ్యూలుపై నాన్చడంపై ఎన్నికల కమీషన్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్‌లో సుడిగాలిలా పర్యటనలు జరిపి తిరిగి వెళ్లిన తర్వాత ఎన్నికల కమిషన్‌ తాపీగా షెడ్యూలు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, ప్రజాస్వామిక వర్గాలు తీవ్ర విమర్శలు సంధించిన తర్వాత ఎన్నికల కమిషన్‌ దిగి వచ్చింది కాని, లేకపోతే కమిషన్‌ ఎన్నికల ప్రకటనను మరింత జాప్యం చేసేదేమో. ఆఖరుకు ప్రధానమంత్రి కూడా ఎన్నికల కమిషన్‌ తరఫున రంగంలోకి దిగి గుజరాత్‌ ఎన్నికల షెడ్యూలు వాయిదాపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమీషన్‌ ప్రధానాధికారి జోతి తనకు ఒకప్పుడు గుజరాత్‌లో ఛీఫ్‌ సెక్రటరీగా పనిచేసినందువల్ల ప్రధాని ఆయనకు అండగా నిలబడడంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఈ మొత్తం ఉదంతం చూస్తుంటే గుజరాత్‌ ఎన్నికలు మొట్ట మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెమటలు పుట్టిస్తున్నట్లు కనపడుతోంది. గత 20 సంవత్సరాలుగా నరేంద్రమోడీకి ఈ రాష్ట్రంలో తిరుగులేకుండా పోయింది. నరేంద్రమోడీ మూడేళ్లక్రితం ప్రధానమంత్రి అయినప్పటి నుంచీ క్రమంగా ఆయనకు రాష్ట్రంలో పట్టులేకుండా పోతున్నది. ఆయన రాష్ట్రంలో పలుసార్లు తిరిగారు. పలు అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు గుజరాత్‌లో జరిగేలా చూశారు.

తాను ప్రధానిగా ఉంటే గుజరాత్‌ అభివద్ది చెందుతుందని సంకేతాలు పంపారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా గుజరాత్‌లో పలు పర్యటనలు చేశారు. గుజరాత్‌కు చెందిన నేత ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే ఇది గుజరాతీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా చిత్రించే ప్రయత్నం ఆయన చేశారు.

నిజంగా ఇది గుజరాతీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యేనా? లేక దేశ ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన సమస్యా అని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నిస్తోంది. గుజరాత్‌ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మక అంశంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంత కష్టపడ్డా కోలుకోలేదని, ఎందుకంటే బీజేపీ తరఫున నరేంద్రమోడీ, అమిత్‌ షా ఉన్నంతకాలం బీజేపీకి తిరుగులేదని ఇంతకాలం జనం అనుకునేవారు.

కాని ఇప్పుడు పరిస్థితి మారింది. అయితే గుజరాత్‌లో నరేంద్రమోడీ గ్రాఫ్‌ పడిపోయిందని చెప్పలేం. ఆయన ఈ దేశ ప్రధానమంత్రి. గుజరాత్‌ ప్రతినిధి. గుజరాత్‌కు చెందిన అమిత్‌ షాయే బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్రంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో ఘనులు. మొదటిది గుజరాత్‌ల ఆత్మగౌరవానికి సంబంధించినదైతే, రెండవది, బీజేపీ అధికారం కోల్పోతే మళ్లీ ముస్లింల ప్రాబల్యం పెరుగుతుందని, రాష్ట్రం అభివద్దిలో వెనకపడుతుందని ప్రచారం చేయడం.

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ గుజరాత్‌ ఎన్నికలకు బీజేపీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఇన్‌ఛార్జి భూపేందర్‌ యాదవ్‌ కూడా బాగా చెమటోడుస్తున్నారు కేంద్రమంత్రులు వరుసగా గుజరాత్‌కు లైన్లు కడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను కూడా గుజరాత్‌కు పంపించే అవకాశాలున్నాయి. నితీష్‌ కుమార్‌ను కూడా బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్లమని కోరవచ్చు.

ఏమైనా గుజరాత్‌ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమైనవి. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు తన పతనానికి ప్రారంభం కాకుండా చూసుకోవాలని నరేంద్రమోడీ భావిస్తుంటే ఈ ఎన్నికలు తన నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందని రాహుల్‌ గాంధీ ఆశిస్తున్నారు. 2019 ఎన్నికలకు సిద్ధం కావడానికి ముందు గుజరాత్‌ ఎన్నికలు సెమిఫైనల్‌గా పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్‌లో మరోపార్టీ రంగంలో లేదు కనుక ఇది బీజేపీ, కాంగ్రెస్‌లకు అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు.

నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్‌కు సంబంధించి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేశారు. అందులో ముఖ్యమైనది బుల్లెట్‌ రైలు. జపాన్‌ ప్రధానిని గుజరాత్‌కు రప్పించి అహ్మదాబాద్‌- ముంబై మధ్య హైస్పీడ్‌ రైల్వే నెట్‌వర్క్‌కు శంఖుస్థాపన చేశారు. అహ్మదాబాద్‌- రాజ్‌కోట్‌ జాతీయ రహదారిని ఆరులేన్ల ప్రాజెక్టుగా ప్రకటించారు.. రాజ్‌కోట్‌- మోర్బీ రాష్ట్ర హైవేని నాలుగు లైన్లుగా మారుస్తామని చెప్పారు. నర్మదా నదిపై నిర్మించబోయే భాడ్ఫూత్‌ బ్యారేజి ఆయన ప్రారంభించారు. సూరత్‌ నుంచి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు ఆత్మగౌరవంతో అభివద్ధి అస్త్రంగా మోడీ ప్రధానంగా ప్రయోగిస్తున్నారు. అభివద్ధియా, వారసత్వమా తేల్చుకొమ్మని ఆయన అంటున్నారు.

కాని కాంగ్రెస్‌ వద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. రిజర్వేషన్‌ల కోసం పటేల్‌లు ప్రారంభించిన ఉద్యమం గుజరాత్‌ను సంక్షోభంలో నెట్టివేసింది. దళితులపై జరిగిన అత్యాచారాలు, ఆ వర్గాల్లో మోడీ సర్కార్‌పై నెలకొన్న అసంతప్తి బీజేపీకి సమస్యగా పరిణమించనున్నది. పటీదార్‌, దళిత సమస్యల వల్లే ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ గుజరాత్‌లో వ్యాపారం రంగాన్ని దెబ్బతీసింది.

దాదాపు 20ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ప్రజలు ఈసారి బీజేపీకి ఓటు వేస్తారో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. పలుచోట్ల బీజేపీ నేతలు ర్యాలీలు నిర్వహించలేకపోతున్నారు. పటేల్‌, దళిత వర్గాలు బీజేపీ నేతలను చూడగానే ఆగ్రహం ప్రకటిస్తున్నారు. పటీదార్‌లు రాష్ట్రంలో 16శాతం మేరకు ఉన్నారు వారు మొత్తం 182 సీట్లలో 21సీట్లు పటీదార్ల చేతుల్లో ఉన్నాయి. పటీదార్‌ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ ఎటు మొగ్గుచూపితే ఆటువైపు ఓట్లు 2శాతం మేరకు పెరిగే అవకాశాలున్నాయి.

మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా దళితులు గుజరాత్‌లో ఉద్యమబాట చేపట్టారు. గత ఏడాది ఒక మతగోవు చర్మం వలిచినందుకు నలుగురు దళితులపై దారుణంగా హింసాకాండ జరిగింది. దళితులు పెద్దఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుని బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నారు. గుజరాత్‌లో 7శాతం మేరకు ఉన్న దళితులు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నందువల్ల బీజేపీకి సమస్య ఏర్పడే అవకాశాలున్నాయి.

ఇక బీజేపీకి ప్రధాన మద్దతుదారులైన చిన్నతరహా, మధ్యతరహా వ్యాపారులు వర్తకులు జీఎస్టీ తర్వాత తీవ్రంగా నష్టపోయారు. గుజరాత్‌లో ప్రధాన పాత్ర పోషింటే టెక్స్‌టైల్‌ వ్యాపారులు జీఎస్టీని వెనక్కి తీసుకొమ్మని ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు తర్వాత తాము వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. మొత్తం గుజరాత్‌ ప్రజల్లో 53శాతం పెద్దనోట్ల రద్దుపై అసంతప్తిగా ఉన్నారు.

అంతేకాదు, 1995 నుంచి రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. మోడీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్‌లో ప్రభుత్వం పట్ల ప్రజల అసంతప్తిని తీర్చేనాథుడు లేకుండా పోయారు. మోడీ తర్వాత వచ్చిన నేతలకు అధికారంపై పట్టు లేకుండా పోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల వచ్చిన సమస్యలే కాకుండా గుజరాత్‌లో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కూడా తీవ్ర సమస్యలుగా మారాయి. రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగం పెరుగుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న 30 లక్షలమంది యువతీయువకులకు నిరుద్యోగ భతి ఇస్తామని రాహుల్‌గాంధీ చేసిన ప్రకటనకు యువత పెద్దఎత్తున స్వాగతం పలుకుతోంది.

ఈ అన్ని కారణాల రీత్యా గుజరాత్‌లో నరేంద్రమోడీ అధికారాన్ని నిలుపుకోగలుగుతారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఆయన ప్రధానిగా ఉండగా గుజరాత్‌ను చేజారనిస్తారా అన్నది ప్రధాన ప్రశ్న. కాని పీవీ ప్రధానిగా ఉన్నప్పుడే 1994లో కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయింది. తెలుగు బిడ్డ అని కూడా చూడకుండా ప్రజలు కాంగ్రెస్‌ను తిప్పికొట్టారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే యూపీని కాంగ్రెస్‌ కోల్పోయిందన్న విషయం మరిచిపోరాదు. నరేంద్రమోడీ జాగ్రత్తగా లేకపోతే, ఆయన కూడా గుజరాత్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.


Recent Random Post: