
ఈ శుక్రవారం అందరి ఫోకస్ నాని మూవీ ‘నేను లోకల్’ మీదే నిలిచింది. ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే మాంచి ఎంటర్టైనర్ కావడంతో కలెక్షన్లు కుమ్మేస్తోంది. నిన్నట్నుంచి ఎక్కడ చూసినా ‘నేను లోకల్’ గురించే చర్చ నడుస్తోంది. సంక్రాంతి సినిమాలపై పూర్తిగా ఫోకస్ తగ్గిపోయింది.
అదే సమయంలో ‘నేను లోకల్’తో పాటుగా శుక్రవారమే విడుదలైన ‘కనుపాప’ సినిమా కూడా మరుగున పడిపోయిది. ఐతే దీని గురించి డిస్కషన్ పెద్దగా లేదు కానీ.. ఈ సినిమా జనాల్ని బాగానే ఆకర్షించింది. తక్కువ థియేటర్లలోనే రిలీజైనప్పటికీ ఆయా థియేటర్ల దగ్గర సందడి బాగానే కనిపిస్తోంది. మనమంతా, జనతా గ్యారేజ్, మన్యం పులి సినిమాలతో మోహన్ లాల్ మన ప్రేక్షకులకు బాగానే చేరువయ్యాడన్న సంగతి థియేటర్ల దగ్గర సందడి చూస్తే అర్థమవుతోంది.
ఇక ‘కనుపాప’ విషయానికి వస్తే ఇది మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఒప్పం’కు డబ్బింగ్ వెర్షన్. లెజెండరీ డైరెక్టర్.. లాల్ ఆప్తమిత్రుడైన ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. లాల్ ఇందులో అంధుడి పాత్ర పోషించడం విశేషం. అలాగని ‘శీను వాసంతి లక్ష్మి’ లాగా ఇదేదో సెంటిమెంటు చిత్రం అనుకుంటే పొరబాటే. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఒక సైకో థ్రిల్లర్ నుంచి ఒక పాపను రక్షించడానికి అంధుడైన హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడన్నదే ఈ కథ. సినిమా ఓ మోస్తరుగానే అనిపిస్తుంది కానీ.. దీనికి మోహన్ లాల్ నటనే ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటిదాకా చాలామంది హీరోలు అంధుడి పాత్రలు వేసి ఉండొచ్చు కానీ.. మోహన్ లాల్ వాళ్లందర్లోకి ప్రత్యేకంగా నిలుస్తాడు.
అంధుడి పాత్ర అనగాన కళ్లు తేలేసి చిత్ర విచిత్రమైన హావభావాలు ఇస్తుంటారు సాధారణంగా. కానీ నిజంగా ఒక అంధుడు ఎలా ఉంటాడో సహజంగా.. చాలా ఆసక్తి రేకెత్తించేలా అద్భుత రీతిలో ఈ పాత్రను పోషించాడు మోహన్ లాల్.
సినిమా అంతటా కూడా ఆయన నటనతోనే కాలక్షేపం అయిపోతుందంటే అతిశయోక్తి కాదు. అంధుల పరిశీలనా శక్తి ఎంత గొప్పగా ఉంటుందన్నది ఈ పాత్ర ద్వారా చూపించారు. ఒక థ్రిల్లర్ కథాంశంలో అంధుడిని ప్రధాన పాత్రధారిని చేయడమే ఈ చిత్ర ప్రత్యేకత. ఐతే ఈ కథ పూర్తి స్థాయిలో థ్రిల్ చేయకపోయినా.. కథాకథనాల్లో లోపాలున్నా సరే.. మోహన్ లాల్ చేతికి వెళ్లడం వల్ల దాని స్థాయి మారిపోయింది.
‘కనుపాప’ కచ్చితంగా వర్త్ వాచ్ అనడంలో సందేహం లేదు. ఈ సినిమా చూశాక మన ప్రేక్షకులు మరింతగా ప్రేమలో పడిపోవడం ఖాయం. లాల్‌ను అందరూ కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో చెప్పడానికి ‘కనుపాప’ మరో రుజువు అని చెప్పొచ్చు.
Recent Random Post: