రాజకీయ నేపథ్యంలోనే అనుమతి వస్తుందా?

వైఎస్ జగన్మోహన రెడ్డి చేయదలచుకుంటున్న పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. యాత్ర సాగితే.. ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీస్తుందని తెలుగుదేశం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు తమ రకరకాల ప్రకటనలతో అసలు పాదయాత్ర జరగడమే సరికాదని, దీనికి అనుమతులే రాకూడదని అన్నట్లుగా మాట్లాడుతూ.. విచారణ సాగిస్తున్న కోర్టుల్ని కూడా ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు.

అదే సమయంలో.. జగన్ పాదయాత్రకు సంబంధించి హాజరు మినహాయింపుల అనుమతులు కోరుతుండగా.. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లలో కూడా.. యాత్రకు బ్రేకులు వేయాలనే తృష్ణ ఎక్కువగా కనిపిస్తోంది. ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ.. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు మాత్రం అనుమతి వస్తుందని, హాజరు మినహాయింపు సంగతి ఏమౌతుందో చూడాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

వైఎస్ జగన్ పాదయాత్ర విషయం ముందుగానే ప్రకటించేసి.. శుక్రవారం కోర్టుకు రావాలనే నిబంధన నుంచి మాత్రమే మినహాయింపు ఇవ్వాలంటూ సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. తాను నేరుగా రాలేదు గనుక.. విచారణ ఆగాల్సిన అవసరం లేదని, తన తరఫు న్యాయవాది తప్పక హాజరవుతారని, విచారణను నిరాటంకంగా కొనసాగించవచ్చునని కూడా ఆయన అదే పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. సాధారణంగా ఇలాంటి నేపథ్యంలో అనుమతి వచ్చే అవకాశమే ఉంటుందనేది పలువురి అభిప్రాయం. అయితే పిటిషన్ పై కౌంటర్ వేసిన సీబీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడానికి వీల్లేదంటూ తన వాదనలు సమర్పించింది.

వారు అందులో ప్రధానంగా ‘రాజకీయ కారణాలతో మినహాయింపులు కోరడం సరికాదని, అందుకు చట్టాలు అనుమతించవు’ అని పేర్కొన్నారు. కానీ నిజానికి రాజకీయ కారణాల వల్లనే జగన్ కు అనుమతి లభించే అవకాశం ఉన్నదనేది మరి కొందరు న్యాయనిపుణుల మాటగా ఉంది. ఆయన మీద ఇప్పటిదాకా అభియోగాలే తప్ప.. నేర నిరూపణలు జరగలేదు. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, స్వయంగా చట్ట సభ ప్రతినిధి.

ఇలాంటి రాజకీయ నేపథ్యం వల్లనే సాధారణంగా ఇలాంటి నేరారోపణలు ఉన్న ఇతరుల్లాగా కాకుండా జగన్ కు అనేక వెసులుబాటులు లభించాయి. యథేచ్ఛగా తిరగడానికి, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఆయనకు అనుమతులున్నాయి. కాకపోతే విచారణ నిర్దిష్టంగా శుక్రవారం జరుగుతుంది గనుక.. ఆరోజున కోర్టుకు రావాలన్నది ఒక్కటే ఇబ్బంది.

పాదయాత్ర అనేది సుదీర్ఘంగా ఆరునెలలు సాగుతుంది గనుక.. ఈ పీరియడ్ కు మాత్రం హాజరు మినహాయింపు ఆయన అడుగుతున్నారు. రాజకీయం అనేది జగన్ వ్యక్తిగత అవసరమా? లేదా, ఆయన నాయకుడు గనుక ప్రజలతో ముడిపడిన అంశమా? అనే విషయాల్లో కోర్టు ఎలా భావిస్తుందనే దాన్ని బట్టి అనుమతి ఉంటుంది. అయితే రాజకీయ కారణాల కోసం అనుమతి వద్దని సీబీఐ హైలైట్ చేస్తున్నదే జగన్ కు ఎడ్వాంటేజీ కావొచ్చు. అదే రాజకీయ కారణాల గురించే ఆయనను అనుమతించినా ఆశ్చర్యం లేదని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు.


Recent Random Post: