రాములమ్మ మళ్లీ వెళుతుందా?

విజయశాంతి ఉరఫ్‌ రాములమ్మ మళ్లీ ప్రయాణం కడతారా? ప్రచార రథం ఎక్కి, మైక్‌ పట్టుకొని జోరుగా ప్రచారం చేస్తారా? తెలంగాణ కాంగ్రెసు నాయకురాలైన విజయశాంతి ఎక్కడికి వెళతారు? మైక్‌ పట్టుకొని ఎందుకు ప్రచారం చేస్తారు? అప్పుడే మర్చిపోతే ఎలా? చెన్నయ్‌లోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆగిపోయిన ఉప ఎన్నిక మళ్లీ జరగబోతోంది కదా. డిసెంబరు 21వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించాలని, 24న ఫలితం ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇది దివంగత జయలలిత నియోజకవర్గం. ఆమె మరణం తరువాత దీనికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాటు చేసింది. అభ్యర్థుల ప్రచారం జోరందుకున్న తరువాత, కోట్ల రూపాయలు పంపిణీ జరగడం, కట్టలకొద్దీ డబ్బు బయటపడటంతో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. అప్పటి ప్రచారంలో విజయశాంతి చురుకుగా పాల్గొన్నారు. తన అభిమాన నాయకురాలైన జయ స్నేహితురాలు శశికళ తరపున ప్రచారం చేశారు. చాలారోజులు అక్కడే మకాం వేశారు. ఎన్నిక వాయిదా పడగానే ఉసూరుమంటూ తిరిగొచ్చారు.

ఆమె కాంగ్రెసు రాజకీయాల్లోకి మళ్లీ ఎంటరవుతున్నారనే వార్తలు ఈమధ్య తెలుగు టీవీ ఛానెళ్లలో వచ్చాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మౌనంగా, అజ్ఞాతంలో ఉండిపోయిన ఈమె అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని, త్వరలోనే పునరాగమనం చేస్తానన్నారు. ఈమధ్యనే ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు కాబోతున్న రాహుల్‌ గాంధీని కలుసుకొని తాను మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటానని, తనకు బాధ్యతలు అప్పగించాలని కోరారు. మూడున్నరేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న ఆమెకు బోరు కొట్టిందో, ప్రత్యామ్నాయం దొరకలేదో లేదా కాంగ్రెసులోనే సీరియస్‌గా పనిచేయాలని నిర్ణయించుకుందోగాని రాహుల్‌ని కలుసుకున్నారు.

ఇదిలా ఉండగా, ఈమె మళ్లీ చెన్నయ్‌ వెళతారా? లేదా లేనిపోని వ్యతిరేక ప్రచారం జరుగుతుందని ఊరుకుంటారా? అప్పట్లో ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక వాయిదా పడినప్పటికీ అక్కడే ఉండి ఇంకా ప్రచారం చేశారు. పూర్తి మేకప్‌తో సినిమా హీరోయిన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న తెలంగాణ రాములమ్మ ఎంతో హుషారుగా ప్రచారం చేశారు.

‘అమ్మ’ (జయలలిత) మరణం వెనక ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేవన్నారు. మాజీ సీఎం పన్నీరుశెల్వంపై విమర్శలు చేశారు. ఆర్‌కే నగర్‌లో శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ విజయం సాధిస్తాడనే ధీమా వ్యక్తం చేశారు. అప్పట్లో పర్మినెంట్‌గా చెన్నయ్‌కి షిఫ్ట్‌ అవుతారనే పుకార్లు వచ్చాయి. అన్నాడీఎంకే శశికళ వర్గంలో చేరి అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచన చేస్తున్నారా అనే అనుమానాలు కలిగాయి.

మెరీనాలోని జయలలిత సమాధికి నివాళులు అర్పించిన తరువాత పోయస్‌గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిసి (జైలుకు వెళ్లకముందు) మద్దతు ప్రకటించింది. అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో పళనిసామి విజయం సాధించాక చిన్నమ్మకు అభినందనల వీడియో పంపింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం, ఆయన తరపు ఎమ్మెల్యేలను ‘క్షుద్రశక్తులు’ అని విమర్శించింది.

చిన్నమ్మ మాత్రమే అన్నాడీఎంకేను రక్షించగలరని తెలిపింది. తమిళ రాజకీయాలపై రాములమ్మ ఓవర్‌యాక్షన్‌ చూసి ఒళ్లు మండిపోయిన తమిళ సంగీత దర్శకుడు జేమ్స్‌ వసంతన్‌ ‘విజయశాంతీ… నువ్వు రాజకీయ దిగ్గజం అనుకుంటున్నావా? నీ అభిప్రాయాలు మీ రాష్ట్రంలో చెప్పుకో. ఇది సినిమా కాదు. తమిళ ప్రజల జీవితాలు’..అని ఘాటుగా విమర్శించాడు.

ఆమె ప్రచారానికి వెళ్లినప్పుడు ఎన్నికల కమిషన్‌ ‘రెండాకులు’ గుర్తును స్తంభింపచేసింది. అప్పట్లో సీఎం ఎడప్పాడి పళనిసామి, పన్నీరుశెల్వం వర్గాలు విలీనం కాకపోవడంతో వేరువేరు గుర్తులు ఈసీ కేటాయించింది. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ‘రెండాకులు’ పళనిసామి-పన్నీరుశెల్వం వర్గానికి దక్కింది. దీంతో పళనిసామి ఒక్కసారిగా హీరోగా మారిపోయారు.

శశికళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మళ్లీ ఈ వర్గంలోకి వస్తున్నారు. ఇక ఈమధ్య పోయస్‌గార్డెన్‌లోని జయ ఇంటితో సహా శశికళ, ఆమె బంధువులో ఇళ్లలో, కార్యాలయాల్లో భారీగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్షల కోట్ల అక్రమాస్తులు, సూట్‌కేసు కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో విజయశాంతి వెళ్లి ఎలా ప్రచారం చేస్తారు? ఏమని చెబుతారు? శశికళ కీర్తిని ఏమని పొగుడుతారు? చూడాలి ఏం చేస్తారో…!


Recent Random Post: