సమ్మర్ ధమాకా.. ఎలా మొదలవుతుందో?

కొత్త ఏడాదిలో అందరి దృష్టీ ముందుగా సంక్రాంతి సినిమాల మీద ఉంటుంది. ఐతే ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. దీంతో ఆశలన్నీ సమ్మర్ మూవీస్ మీదే ఉన్నాయి. ఈసారి వేసవి సినిమాల వేడి మామూలుగా ఉండదని.. గతంలో ఎన్నడూ లేనంత వ్యాపారం ఈసారి జరగనుందని.. ఫలితాలు, వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే సమ్మర్ సీజన్ మొదలైంది కానీ.. అది లాంఛనమే.

శుక్రవారం విడుదలవుతున్న ‘రంగస్థలం’తోనే సమ్మర్ ధమాకాకు అసలు సిసలు ఆరంభమన్నమాట. ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ అన్నపుడే అంచనాలు పెరిగిపోయాయి. ఇక గత కొన్ని నెలల్లో ఈ సినిమాపై హైప్ మరింత పెరుగుతూ వచ్చి.. విడుదల సమయానికి అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి.

మరి ‘రంగస్థలం’ ఈ అంచనాల్ని ఏమేరకు అందుకుంటుందో చూడాలి. హైప్ అయితే బాగానే ఉంది కానీ.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయంలో గుబులు లేకపోలేదు. ఎందుకంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు. రామ్ చరణ్ కానీ.. సుకుమార్ కానీ.. ఇంతకుముందెన్నడూ ఇలాంట సినిమా చేయలేదు. అసలు ఈ తరహా సినిమాలే అరుదైపోయాయి. ఒక స్టార్ డైరెక్టర్.. ఒక స్టార్ హీరో గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి సినిమానే ట్రై చేయలేదంటే అతిశయోక్తి కాదు. అందులోనూ 80ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి యువ ప్రేక్షకులకు ఏమేరకు కనెక్టవుతుందన్నది చూడాలి. 80ల అనుభూతుల్ని నోస్టాల్జిక్‌గా ఫీలయ్యే వాళ్లో.. ఏదో ఒక వర్గం ప్రేక్షకులో దీన్ని ఆదరిస్తే సరిపోదు. అందరికీ నచ్చితేనే సినిమా బయటపడుతుంది.
దీని బడ్జెట్ ఎక్కువ. బిజినెస్ కూడా దానికి తగ్గట్లే అయింది. కాబట్టి ‘రంగస్థలం’ లాభాల బాట పట్టాలంటే ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి. మరి సుకుమార్ ఆ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దాడా.. ఈ చిత్రం అంచనాల్ని అందుకుని ఈ చిత్రం బృందం చెబుతున్నట్లుగా ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోతుందా.. సమ్మర్ సీజన్‌కు ఈ చిత్రం అదిరే ఆరంభాన్నిస్తుందో.. అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.


Recent Random Post: