‘శంకరాభరణం’ చిత్రానికి అరుదైన గౌరవం..!

తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన దృశ్య కావ్యం “శంకరాభరణం”. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. సంచలన విజయం సాధించింది. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరావు ఈ సినిమాని నిర్మించారు.

ఈ ఏడాదితో 42 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘శంకరా భరణం’ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం ( IFFI) – 2022లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్స్ విభాగంలో ఎంపికైనట్లు తెలుస్తోంది.

నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా మన దేశంలో విడుదలై ప్రేక్షకులను అలరించిన గొప్ప చిత్రాలని డిజిటలైజ్ చేసి భద్రపరుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన “శంకరాభరణం” చిత్రానికి చోటు కల్పించారు.

‘శంకరా భరణం’ సినిమాలో జేవి సోమయాజులు – మంజు భార్గవి – చంద్రమోహన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 1980 ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు – కర్ణాటక – కేరళ వంటి పక్క రాష్ట్రాల్లోనూ అఖండ విజయం సాధించింది.

మలయాళంలో ఈ సినిమా ఏడాదికి పైగా ప్రదర్శించబడగా.. బెంగుళూరులో తెలుగు వెర్షన్ ఒక సంవత్సరం పాటు ఆడటం విశేషమని చెప్పాలి. శాస్త్రీయ సంగీతం ప్రాముఖ్యతను తెలియజేసిన ఈ చిత్రం.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పింది.

అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి తెలుగు చిత్రంగా ‘శంకరాభరణం’ నిలిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఉత్తమ జనరంజక చిత్రం సహా నాలుగు జాతీయ అవార్డులు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 7 నంది అవార్డులను గెలుపొందింది.

బెసన్కాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ( ఫ్రాన్స్ ) లో ఉత్తమ చిత్రంగా ‘శంకరాభరణం’ అంతర్జాతీయ అవార్డు అందుకుంది. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ చిత్రాన్ని.. ఇప్పుడు ‘IFFI – 2022’ లో భాగంగా స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు. దీనికి చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతారని తెలుస్తోంది.