6నెలల చిన్నారికి సంజీవని.. ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’

మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు’ కరోనా బాధితులు ఎందరినో ఆదుకుంటున్నాయి. ఈక్రమంలో ఓ ఆరు నెలల పసిపాపకు చిరంజీవి అందించిన ఆక్సిజన్ సిలిండర్ సంజీవనిలా మారి ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంకు చెందిన సోమా రామకృష్ణ, లక్ష్మీ దంపతులు. వారి ఆరు నెలల పసిపాప నిషితకు కరోనా సోకింది. పాపను కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 14 రోజుల చికిత్స అందించారు. నెగటివ్ రావడంతో ఇంటికి తీసుకొచ్చారు. అయితే.. అనుకోకుండా చిన్నారికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. దీంతో పాప శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది.

వెంటనే తల్లిదండ్రలు చిన్నారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఆక్సిజన్ సిలిండర్ కసం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన చిరంజీవి అభిమానులు హుటాహుటిన పాప ఇంటికి సిలిండర్ చేర్చారు. ప్రస్తుతం చిన్నారికి ఇంట్లోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇప్పటివరకూ రెండు సిలిండర్లు అందించారు. అవసరమైతే మరిన్ని సమకూర్చేందుకు సిద్ధమని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంది. ఫోన్ చేసిన వెంటనే స్పందించిన చిరంజీవి అభిమానులకు, సిలిండర్ ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవికి చిన్నారి తల్లి లక్ష్మి కృతజ్ఞతలు చెప్తోంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో సిలిండర్లు అందిస్తూ ఎందరినో ఆదుకుంటున్నారు.