బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత సినిమాలకి నా బాడీ సహకరించడం లేదు : కాజల్

చందమామ.. మగధీర సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో రూపొందిన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కాజల్ అగర్వాల్ దాదాపుగా దశాబ్దకాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సందడి చేసిన విషయం తెల్సిందే.

హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో కాజల్ అగర్వాల్ తన ప్రియుడు కిచ్లు ను వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ గా ఈమె కంటిన్యూ అవుతుందని అంతా భావించారు. ఇంతలోనే గర్భం దాల్చింది.. వచ్చిన ఆఫర్లను కాదన్నది.. నాలుగు నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గర్భం దాల్చిన సమయంలో… డెలివరీ అయిన సమయంలో శరీరంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు తిరిగి సాధారణ స్థితికి రావడానికి కాస్త సమయం అయితే పడుతుంది. కొందరు డెలవరీ తర్వాత చాలా త్వరగానే నార్మల్ స్థితికి వస్తారు. కానీ కొందరికి మాత్రం ఎక్కువ సమయం పడుతుంది. కాజల్ అగర్వాల్ మాత్రం చాలా త్వరగానే మునుపటి స్థితికి వచ్చినట్లుగా అనిపిస్తుంది.

తాజాగా ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. ఆ సందర్భంగా గుర్రపు స్వారీని చేయాలని కాజల్ భావించింది. అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. ఆ వీడియోలతో పాటు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బాడీ కాస్త సహకరించడం లేదు.

ఇప్పుడు ఎలాంటి వర్కౌట్స్ చేయాలనుకున్నా.. ఏ పని చేయాలన్నా కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. ప్రతి విషయానికి నా బాడీ సహకరించడం లేదు అంటూ ఆమె ఇన్ స్టా గ్రామ్ లో రాసుకుంది. త్వరలోనే పూర్వ స్థితికి వస్తాను అన్నట్లుగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కి గతంలో మాదిరిగా ఆఫర్లు వస్తాయా అంటే చాలా మంది డౌటే అంటున్నారు. అయినా కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్లాలని కాజల్ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.