వైసీపీ నుంచి బీజేపీలోకి వలస మొదలైందహో.!

తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, షర్మిల పార్టీలోకి కాకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నారు. ‘షర్మిలతో సన్నిహిత సంబంధాలున్నాయి.. ఆమె రాజకీయ పార్టీ పెడుతుండడాన్ని ఆహ్వానిస్తున్నాను.. అయితే, జాతీయ పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచనతోనే, షర్మిల పార్టీలోకి వెళ్ళడంలేదు..’ అని గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించుకున్న విషయం విదితమే.

‘తెలంగాణలో వైసీపీ విస్తరించే అవకాశం లేదని, పార్టీ అధిష్టానమే చెప్పింది గనుక, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని కూడా గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలంటూ తెలంగాణలో పార్టీకి ఉనికి లేని పరిస్థితి వచ్చనా, పార్టీని ఇన్నాళ్ళూ అంటిపెట్టుకుని వున్నారాయన. మరోపక్క, తెలంగాణ వైసీపీ నేతల్లో దాదాపు అందరూ షర్మిల పార్టీ వైపుకు వెళ్ళిపోయారు. ఆ మాటకొస్తే, ఆ ఉద్దేశ్యంతోనే షర్మిలతో వైఎస్ జగన్ తెలంగాణలో పార్టీ పెట్టించారనుకోండి.. అది వేరే విషయం.

ఇక, గట్టు శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీలోకి వెళుతుండడం వెనుక పెద్ద వ్యూహమే వుందన్న చర్చ జరుగుతోంది. బీజేపీతో తెరవెనుకాల సఖ్యత చెడిపోకుండా గట్టు శ్రీకాంత్ రెడ్డి ద్వారా రాజకీయం నడపొచ్చన్న ఉద్దేశ్యంతోనే ఆయన్ని వైసీపీ అధినాయకత్వం బీజేపీలోకి పంపిస్తోందట. తద్వారా తెలంగాణలో బీజేపీ – షర్మిల పార్టీ మధ్య సత్సంబంధాలూ ఏర్పడతాయని వైసీపీ అధినాయకత్వం గట్టిగా నమ్ముతోందట.

నిజానికి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, షర్మిల పార్టీ వైపు వెళితే.. షర్మిల పార్టీలో కీలక స్థానంలోనే వుండేవారు. అలా ఆయన ఆలోచన చేయలేదంటే, దానిక్కారణం వైసీపీ అధిష్టానం పన్నిన తెలివైన రాజకీయ వ్యూహమేనని అనుకోవాలేమో. ఏప్రిల్ 9న షర్మిల తన పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే.