మేఘా ఆకాశ్‌కు క‌లిసొచ్చిన నిహారిక పెళ్లి

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు, హీరోయిన్ నిహారిక త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న నేప‌థ్యంలో…చేతిలో ఉన్న ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నే త‌లంపుతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్‌లో ఓ ప్రేమాక‌థా చిత్రంలో న‌టించేందుకు గ‌తంలో చేసుకున్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకున్నారామె. ఇదే స‌మ‌యంలో వేరే ప్రాజెక్టులు పూర్తి చేసే ప‌నిలో పూర్తిస్థాయిలో నిమ‌గ్న‌మ య్యారు. ఇదే స‌మ‌యంలో మ‌రో న‌టికి నిహారిక పెళ్లి రూపంలో హీరోయిన్ చాన్స్ ద‌క్కింది.

ఈ నేప‌థ్యంలో కోలీవుడ్‌లో స్వాతిని ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ సెల్వ‌న్ హీరోగా తెర‌కెక్క‌నున్న ప్రేమా క‌థా చిత్రం నుంచి నిహారిక త‌ప్పుకోవ‌డంతో….ఆమె ప్లేస్‌ను న‌టి మేఘా ఆకాశ్ భ‌ర్తీ చేశారు. వేస‌విలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్‌-19 వీర‌విహారం కార‌ణంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా నిహారిక అందులో చేద్దామ‌న్నా…వివాహ నిశ్చ‌యం కావ‌డంతో, అది వీల‌య్యే ప‌రిస్థితి లేదు. దీంతో కోలీవుడ్ సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు నిహారిక చిత్ర నిర్మాత‌కు చెప్పేశారు.

దీంతో హీరోయిన్‌గా మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసుకున్న‌ట్టు నిర్మాత సెల్వాకుమార్ తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర విభిన్నంగా ఉంటుంద‌ని , మేఘా ఆకాశ్ స‌రిగ్గా స‌రిపోతార‌ని ద‌ర్శ‌కుడు సూచించ‌డంతో…ఎంపిక చేసిన‌ట్టు నిర్మాత తెలిపారు. వ‌చ్చే నెల‌లో సినిమా షూటింగ్ చేప‌ట్ట‌నున్న‌ట్టు నిర్మాత తెలిపారు.