స్టేజ్‌పై మంటలు పుట్టించిన అఖిల్-తేజు

ఇంతకుముందు అవార్డులంటే నంది.. జాతీయ అవార్డులు.. ఫిలిం ఫేర్ పురస్కారాలే గుర్తుకొచ్చేవి. ఐతే ఈ మధ్య మా టీవీ అవార్డులు.. సైమా అవార్డు.. ఐఫా అవార్డులు బాగా ఫేమస్ అయ్యాయి. తాజాగా హైదరాబాద్ ఆతిథ్యమిచ్చిన ఐఫా ఉత్సవం అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఈ వేడుకకు సౌత్ ఇండియా నుంచి బోలెడంతమంది తారలు విచ్చేశారు. టాలీవుడ్ నుంచి చాలామంది హీరో హీరోయిన్లు.. టెక్నీషియన్లు ఈ వేడుకలో తళుక్కుమన్నారు. డిజైనర్ డ్రెస్సుల్లో హీరోయిన్లు అందాల విందు చేస్తూ ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇక ఈ వేడుకలో నృత్య ప్రదర్శనలు కూడా అదిరిపోయాయన్న టాక్ వస్తోంది. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్-అఖిల్ కలిసి నిన్న రాత్రి చేసిన డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. రేప్పొద్దున ఈ ఈవెంట్ టీవీలో టెలికాస్ట్ అయినపుడు కూడా జనాల్ని ఆకర్షించే మూమెంట్ ఇదే అని ఆ వేడుకకు హాజరైన వారు చెబుతున్నారు. ఎప్పుడు వీలు చిక్కినా చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేస్తూ అదరగొట్టే సాయిధరమ్ తేజ్.. మరోసారి తన మెగా మావయ్య మెడ్లేతో రచ్చ రచ్చ చేశాడట.

దీని కంటే పెద్ద విశేషం ఏంటంటే.. మధ్యలో అతడికి అఖిల్ తోడయ్యాడట. ఇద్దరూ కలిసి మెగాస్టార్ మెడ్లేకు అదిరిపోయే స్టెప్పులేస్తూ రచ్చ రచ్చ చేశారని.. ఆడిటోరియాన్ని హోరెత్తించేశారని అంటున్నారు. త్వరలోనే ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో ఈ వేడుక ప్రసారమవుతుంది. అప్పుడు చూద్దాం తేజు-అఖిల్ రచ్చ ఎలా సాగిందో!