త‌మిళ పెళ్లిచూపులు ఫ‌స్ట్ పోస్ట‌ర్

పెళ్లిచూపులు.. గ‌త ఏడాది టాలీవుడ్లో ప్ర‌కంప‌న‌లు రేపిన సినిమా.  ఈ పేరుతో ఓ సినిమా వ‌స్తోంద‌న్న‌పుడు జ‌నాలు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. ఎందుకంటే అదేమంత ఆకర్షణీయమైన టైటిల్ కాదు. పైగా ఇందులోని నటీనుటులు కొత్తవాళ్లే. దర్శకుడు కూడా పరిచయం లేని వాడే. కానీ విడుదల తర్వాత ఆ సినిమా ఎంత సంచ‌ల‌నం రేపిందో.. ఎంత పెద్ద విజ‌యం సాధించిందో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

‘పెళ్లిచూపులు’ విడుద‌లైన కొన్ని రోజుల‌కే రీమేక్ హ‌క్కుల కోసం పొరుగు భాష‌ల నుంచి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. హిందీలో వశు భగ్నాని ఈ చిత్ర రీమేక్ హక్కులు తీసుకున్నాడు. త‌మిళంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని రేమేక్ చేయ‌డానికి ముందుకొచ్చాడు. ‘పొన్ ఒరు కండేన్’ (ఒక అమ్మాయిని చూశా) పేరుతో త‌మిళ ‘పెళ్లిచూపులు’ తెర‌కెక్క‌నుంది. గౌత‌మ్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌ని చేసిన సెంథిల్ వీరాస్వామి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోయింది. ఫ‌స్ట్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసేశారు. ఆ పోస్ట‌ర్ మీద ఒరిజిన‌ల్ స్టోరీ క్రెడిట్ త‌రుణ్ భాస్క‌ర్‌కే ఇవ్వ‌డం విశేషం.

తెలుగులో రీతు వ‌ర్మ చేసిన పాత్ర‌ను త‌మిళంలో త‌మ‌న్నా చేస్తుండ‌టం విశేషం. విష్ణు విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. అత‌ను ప్రేమ లీల పెళ్లి గోల అనే అనువాద చిత్రంతో త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమా మొద‌లైన సంద‌ర్భంగా గౌత‌మ్ స్పందిస్తూ.. త‌మిళ ‘పెళ్లిచూపులు’ ఎలాంటి షేప్ తీసుకుంటుందో చూడాల‌ని ఆస‌క్తిగా ఉంద‌న్నాడు. మ‌రి త‌మిళంలోనూ ఈ చిత్రం తెలుగులో మాదిరే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందేమో చూద్దాం.