ఇంత అ‘న్యాయమా’.? జగన్ సర్కారు మరీ ఇంతలా దోచిపెడ్తోందా.?

‘సలహాదారుల’ పేరు చెప్పి, అయినవారికి అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దలు దోచిపెడుతున్నారన్న విమర్శలు ఈనాటివి కావు. గతంలోనూ వున్నవే. అప్పట్లో.. అంటే చంద్రబాబు హయాంలో కుటుంబరావు తదితరులకు ప్రజాధనాన్ని దోచిపెట్టారని వైసీపీ విమర్శించింది. అనుకూల మీడియాకి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన వైనం గురించీ వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. కానీ, వైసీపీ హయాంలో జరుగుతున్నదేంటి.?

చంద్రబాబు హయాంలోకంటే సలహాదారులు పెరిగారు.. వారికి చెల్లింపులూ పెరిగాయి. అందునా, ఓ సామాజిక వర్గానికే ఎక్కువగా ఈ పదవులు దక్కుతున్నాయి. ఇదిలా వుంటే, తాజాగా అదనపు అడ్వొకేట్ జనరల్ విషయమై అన్యాయంగా దోచిపెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలొచ్చాయి. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకి కొదవేం లేదని.. ఎడా పెడా నమోదవుతున్న కేసుల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే, అయినవారికి అడ్డగోలుగా దోచిపెట్టడం అనేది ఇదిగో, ఇలాంటి విషయాలతోనే అర్థమవుతుంది.

రాష్ట్రానికి ఒకే ఒక్క అదనపు అడ్వొకేట్ జనరల్ వుండాల్సి వున్నా, ఇద్దర్ని నియమించుకుందట వైఎస్ జగన్ సర్కార్. అడ్వొకేట్ జనరల్ కంటే కూడా వీళ్ళకే ఎక్కువ చెల్లింపులు, ఇతరత్రా గౌరవాలూ దక్కుతున్నాయన్నది టీడీపీ అనుకూల మీడియా ఆరోపణ. గతంతో పోల్చితే దాదాపు రెట్టింపు మొత్తం ఒక్క రోజులోనే అదనపు అడ్వొకేట్ జనరల్ సంపాదించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాల్లో మార్పులు చేసిందట.. అదీ నిబంధనల్ని తుంగలోకి తొక్కి. సొమ్ము జనానిది కాబట్టి, అధికారంలో వున్నవారు తమకు నచ్చినవారికి దోచిపెట్టుకోవచ్చు.. అంటే ఇదసలు ప్రజాస్వామ్యమే కాదు.

ఇక, టీడీపీ అనుకూల మీడియా కథనాల్లో వాస్తవాలు లేవని ప్రభుత్వం చెప్పదలచుకుంటే, ఆయా కథనాలపై కేసులు నమోదు చేయాలి. మిన్నకుండిపోతే మాత్రం, జనం సొమ్ముని అధికార పార్టీ పెద్దలు దోచేయడంతోపాటు, దోచిపెట్టేస్తున్నారని జనం భావించాల్సి వుంటుంది.