ఫ్రీజర్ లోంచి బయటపడి బతికిపోయింది!

కోల్డ్ స్టోరేజ్ గొడౌన్ (ఫ్రీజర్) లో లాక్ అయిపోయిన ఒక అందమైన అమ్మాయి బతుకు పోరాటం నేపథ్యంలో ‘మిలీ’ అనే ఇంట్రెస్టింగ్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. నిజఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. చలికి గడ్డకట్టిపోయే సన్నివేశంలో జాన్వీ కపూర్ ఎలాంటి పోరాటం సాగిస్తోందో ఇంతకుముందే ట్రైలర్ లో వీక్షించాం. గగుర్పొడిచే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మిలీ ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించింది. ఫ్రీజర్లో చిక్కుకున్న మిలీ ప్రాణాలను కాపాడుకోవడానికి కాలంతో ఎలా పరిగెత్తిందో చూపించారు.

మిలీ నుండి వరుస ఫోటోలు వీడియోలను జాన్వీ షేర్ చేస్తూ ప్రచారం హోరెత్తిస్తోంది. వీటి ద్వారా అంతకంతకు అభిమానుల ఉత్సుకతను రేకెత్తిస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని మొదట మలయాళంలో నిర్మించారు. ఇప్పుడు హిందీ వెర్షన్ విడుదలవుతోంది.

రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ అందమైన అమ్మాయి మనుగడ నేపథ్యంలో చిల్లింగ్ స్టోరీని ఎలివేట్ చేసింది. ఇక ఇదే ట్రైలర్ లో జాన్వీ కపూర్ పోషించిన మిలీ వెనుక అసలు కథను చూపుతుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తన తండ్రి మనోజ్ పహ్వా(బోనీ)ను కౌగిలించుకోవడం… అనంతరం ఎమోషన్స్ ని చూపించారు. “నా పేరు మిలి నౌడియాల్.. నేను మా నాన్నతో నివసిస్తున్నాను” అంటూ తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని ఇందులో ఆవిష్కరించారు. జాన్వీ కపూర్ తండ్రి బాత్రూంలో రహస్యంగా సిగరెట్ తాగుతున్నట్లు … మిలీ తన తండ్రితో స్నేహపూర్వక బంధాన్ని పంచుకోవడం .. తాను ఎంతగానో ప్రేమించే నాన్నను వదిలి కెనడాకు వెళ్లాలనే ఆమె నిర్ణయం వగైరా వగైరా ట్విస్టులు మిలీ ట్రైలర్ లో ఉత్కంఠను పెంచాయి.

ఇందులోనే జాన్వీ కపూర్ సన్నీ కౌశల్ తో కలిసి బైక్ పై రైడ్ చేయడం చూడగానే తనకు ఒక బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా అర్థమవుతుంది. మిలీ ఫాస్ట్ ఫుడ్ చైన్ లో పని చేస్తూ అక్కడ పనిచేసే ప్రదేశంలోని రిఫ్రిజిరేటర్ లో చిక్కుకున్న తర్వాత ఆమె జీవితం మారిపోతుంది.

మిగిలిన ట్రైలర్ లో జాన్వీ మనుగడ కోసం చేసే పోరాటాన్ని ఆవిష్కరించారు. అయితే ఆమె ఆచూకీ గురించి ఆమె ప్రియుడు – తండ్రి ఆందోళన చెందుతారు. ఫ్రీజర్ లోని ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి జాన్వీ ప్లాస్టిక్ తో చుట్టుకుని ఉన్న దృశ్యంతో ట్రైలర్ ముగుస్తుంది. ఓవరాల్ గా పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాతో జాన్వీ అభిమానుల ముందుకు వస్తోంది.

జాన్వీ ప్రస్తుతం మిలీ సినిమాని ప్రమోట్ చేసేందుకు సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా జాన్వీ ట్రెడిషనల్ వేర్ లోనే హాటెస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఫోటోషూట్ ఇన్ స్టాలో షేర్ చేసింది. “ఫ్రీజర్ నుంచి అమ్మాయి బయటపడి నేరుగా మీ మృదయాల్లోకి ప్రవేశిస్తుంది.. ఇవిగో నా పోర్ట్రెయిట్స్!” అంటూ ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇందులో జాన్వీ ఎంతో అందంగా మనోహరంగా కనిపిస్తోంది. బోయ్స్ కలల రాకుమారిలా కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు.