ఎక్స్ క్లూజివ్: లూసిఫెర్ రీమేక్ – చిరంజీవి, వినాయక్ మీటింగ్?

మెగాస్టార్ చిరంజీవి మలయాళం పొలిటికల్ డ్రామా లూసిఫెర్ చిత్రాన్ని చూసి ఎంతో ముచ్చటపడి రామ్ చరణ్ చేత కొనుగోలు చేయించిన విషయం తెల్సిందే. ఈ రీమేక్ ను స్టైలిష్ గా తెరకెక్కిస్తే బాగుంటుందని యువ దర్శకుడు సుజీత్ కు బాధ్యతలు అప్పగించారు. కొన్ని నెలల పాటు సుజీత్ ఈ రీమేక్ స్క్రిప్ట్ పై వర్క్ చేసాడు కూడా. అయితే సుజీత్ చేసిన మార్పులు, ఇచ్చిన నరేషన్ పై మెగాస్టార్ పెదవి విరిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుజీత్ ను తప్పించి వివి వినాయక్ చేతికి పగ్గాలు అందించినట్లు సమాచారం.

వివి వినాయక్ అంటే మెగాస్టార్ కు చాలా గురి. తన రీఎంట్రీ చిత్రానికి దర్శకుడిగా వినాయక్ నే ఎంచుకున్నాడు చిరు. ఈ నేపథ్యంలో రీసెంట్ గానే ప్రాజెక్టులోకి ఎంటరైన వినాయక్ వచ్చే వారం నుండి స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో వర్క్ చేయనున్నాడట. దీని గురించి వచ్చే సోమవారం చిరంజీవి, వినాయక్ ల మధ్య కీలకమైన మీటింగ్ జరగనుందని టాక్.

ఈ మీటింగ్ లో చిరంజీవి తన కథ ఎలా కావాలనుకుంటున్నదీ చెప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ లూసిఫెర్ రీమేక్ స్క్రిప్ట్ పనులు లేట్ అయితే చిరంజీవి దర్శకుడు బాబీ ప్రాజెక్ట్ తో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఏదేమైనా దసరాకు చిరంజీవి తర్వాతి సినిమాపై ప్రకటన రావడం ఖాయం.