పూజా హెగ్డే-స్టాండింగ్ కామెడీ

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అని లెక్కలు తీస్తే, వెంటనే పూజా హెగ్డే పేరు పక్కాగా వస్తుంది. ప్రతి టాప్ హీరో పక్కన నటించడమే కాదు, సక్సెస్ రేట్ కూడా అలాగే వుంది. ప్రస్తుతం అఖిల్ తో ఒక సినిమా చేస్తోంది పూజ. ఇప్పటి వరకు కేవలం పాటలు, డ్యాన్స్ లు, ఓరకంటి చూపులతో అలరించిన పూజా ఈ సినిమాలో కామెడీతో నవ్వించబోతోందని తెలుస్తోంది.

అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తయారవుతున్న బ్యాచులర్ సినిమాలో పూజా హెగ్డే స్టాండింగ్ కమెడియన్ గా కనిపించబోతోందని తెలుస్తోంది. స్టాండప్ కామెడీ అన్నది తెలుగు వారికి కాస్త పరిచయం తక్కువ. అయితే సోషల్ మీడియాలో ఎక్కవగా కనిపిస్తూ వుంటుంది. ముఖ్యంగా హిందీలో స్టాండింగ్ కామెడీ అన్నది బాగా పాపులర్ అయింది.

అలా కదలకుండా నిల్చుని, కేవలం తమ సంభాషణా చాతుర్యంతో నవ్వించాల్సి వుంటుంది. ఇలా చేయాలంటే స్క్రిప్ట్ చాలా ముఖ్యం. మరి బ్యాచులర్ సినిమాకు తెరవెనుక అన్నీ తానై చూసుకుంటున్న వాసు వర్మ ఏ మేరకు మాంచి నవ్వులు పంచే సంభాషణలు రాసి, పూజా చేత స్టాండింగ్ కామెడీ చేయించారో చూడాలి.